Omar Abdullah attacks Centre: ఇటీవల హత్యకు గురైన టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ నివాసాన్ని సందర్శించిన ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఉగ్రవాదులు ఎక్కడికైనా తెగబడుతున్నారని, ప్రభుత్వం వారిని అడ్డుకోలేక పోతుందని అన్నారు. ప్రజలు తమ ఇళ్లలో ఉండానికి కూడా భయపడుతున్నారనీ, కాశ్మీర్‌లో పరిస్థితి మరింత దిగజారిందని కేంద్రంపై ఒమర్ అబ్దుల్లా విమ‌ర్శాస్త్రాల‌ను సంధించారు. తన తండ్రి ఫరూక్ అబ్దుల్లాకు ED సమన్లు పంప‌డానికి తీవ్రంగా ఖండించారు. 

Omar Abdullah attacks Centre: జ‌మ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఎక్కడైనా దాడికి తెగ‌బ‌డుతున్నార‌నీ, ప్రభుత్వం వారిని అడ్డుకోవ‌డంలో విఫ‌ల‌మైంద‌ని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. కొద్ది రోజుల క్రితం ఉగ్రవాదుల చేతిలో హతమైన టీవీ నటి అమ్రీన్ భట్ ఇంటికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాశ్మీర్‌లో ఎవరూ సురక్షితంగా లేరని, ప్ర‌స్తుతం ప్రజలు తమ ఇళ్లలో ఉండానికి కూడా భయపడుతున్నారని, టీవీ నటి అమ్రీన్ భట్ ను ఉగ్రవాదులు ఆమె నివాసంలో కాల్చి చంపారనీ, పిల్లలను కూడా వదిలిపెట్టలేదనీ, ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. వారు సామాన్య‌ పౌరులను ల‌క్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కారణమని అబ్దుల్లా ఆరోపించారు. త‌మ ప్రభుత్వంతో పోలిస్తే.. బీజేపీ ప్ర‌భుత్వంలో కాశ్మీర్ లోయలో పరిస్థితి మరింత దిగజారిందనీ, త‌మ ప్రభుత్వం హ‌యంలో శ్రీనగర్, గందర్బాల్, బుద్గామ్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని దాదాపు నిర్మూలించామని ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. 

కేంద్రం పర్యాటక రంగాన్ని సాధారణ స్థితితో పోలుస్తోందని, అవి రెండు వేర్వేరు సమస్యలు అని అన్నారు. పెద్ద సంఖ్యలో పర్యాటకులు కాశ్మీర్ లోయను సందర్శిస్తుంటారని ప్ర‌భుత్వం చెప్పుతున్నా.. దానిని కాశ్మీర్ పరిస్థితితో కలపకూడదని అన్నారు.

 క్రికెట్ స్కామ్‌లో NC చీఫ్ ఫరూక్ అబ్దుల్లాకు ED సమన్లపై స్పందించారు. ​​భారతదేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలకు సాధారణమేన‌నీ, ఎన్నికలు ఏ రాష్ట్రంలో ప్రకటించబోతారో.. ఆ రాష్ట్ర రాజ‌కీయ పార్టీల రాజ‌కీయ నేత‌ల‌పై కేంద్రం.. దర్యాప్తు సంస్థలను ప్ర‌యోగిస్తుంద‌ని, ఈసారి కూడా అలాగే ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినందుకు ప్రతిపక్ష పార్టీలు చెల్లించే మూల్యం ఇదేన‌ని అబ్దుల్లా ఆరోపించారు.

NC చీఫ్ ఈ విషయంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటార‌నీ, దర్యాప్తు సంస్థలకు సహకరించారనీ తెలిపారు. J&Kలో టార్గెట్ చేయబడిన నాయకులు PAGD కూటమి పార్టీలకు చెందినవారు కావడం కూడా యాదృచ్చికం కాదని ఒమర్ అబ్దుల్లా అన్నారు. మే 31న ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో హాజరుకావాలని ఫరూక్‌ అబ్దుల్లాకు ఈడీ సమన్లు ​​పంపింది.