New Delhi: కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగంతో ప్రజలు బాధపడుతున్నారు కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మండిపడ్డారు.
Congress president Mallikarjun Kharge: దేశ మౌలిక అంశాలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయనీ, సమాజం ద్వేషంతో చీలిపోతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ 138 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదల, నిరుద్యోగంతో దేశ ప్రజలు ప్రభావితమవుతున్నారు, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అందరినీ కలుపుకొని పోవడం, వెంట తీసుకెళ్లడం కాంగ్రెస్ విధానం వల్లే భారతదేశం పురోగమిస్తోందని అన్నారు.
భారత్ విజయవంతమైన, బలమైన ప్రజాస్వామ్యంగా అవతరించడమే కాకుండా, కొన్ని దశాబ్దాల్లోనే ఆర్థిక, అణు, వ్యూహాత్మక రంగాలలో సూపర్ పవర్ గా అవతరించిందని, వ్యవసాయం, విద్య, వైద్యం, ఐటి, సేవల రంగంలో ప్రపంచంలోని అగ్ర దేశాలలో ఒకటిగా ఉందని ఖర్గే అన్నారు. "ఇది తనంతట తానుగా జరగలేదు. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ కు ఉన్న విశ్వాసం, అందరినీ కలుపుకొనిపోయే భావజాలం, అందరికీ సమాన హక్కులు, అవకాశాలను కల్పించే రాజ్యాంగంపై మాకున్న పూర్తి విశ్వాసం వల్ల ఇది జరిగింది' అని ఆయన అన్నారు.
ఈ క్రమంలోనే కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'భారతదేశ మౌలికాంశాలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. సమాజంలో ద్వేషం, ధరల పెరుగుదల, నిరుద్యోగంతో ప్రజలు బాధపడుతున్నారని, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కాగా, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఖర్గే ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు.
ధరల పెరుగుదల, నిరుద్యోగం, ద్వేషానికి వ్యతిరేకంగా పోరాటంలో యువత, మహిళలు, అణగారిన వర్గాలను ఏకం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇది ఇప్పటికే రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రతో ప్రారంభమైందని ఖర్గే చెప్పారు. ఈ యాత్ర సంజీవనిని అందించిందనీ, ఇది దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను చైతన్యవంతం చేసిందని అన్నారు. భారత్ జోడో యాత్రకు దేశ ప్రజల నుండి భారీ మద్దతు లభించిందనీ, ఇది కాంగ్రెస్ ప్రత్యర్థులను కలవరపరిచిందని ఆయన అన్నారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ, ఎల్లప్పుడూ సత్యం, అహింస, పోరాట మార్గాన్ని ఎంచుకుని ప్రజా శ్రేయస్సు కోసం ప్రతి అడుగు వేసిన సంస్థలో భాగం కావడం గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.
