ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌వీర్‌ సింగ్‌ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.  ఈ మేరకు ఆయన సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాసిన విషయం తెలిసిందే.

దీంతో ఆదివారం ముంబయి, నాగ్‌పూర్‌ సహా పలు ప్రధాన నగరాల్లో ప్రతిపక్ష బీజేపీ నాయకులు హోంమంత్రికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెంటనే హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే అత్యవసర సమావేశం నిర్వహించారు.

పరమ్‌వీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణల విషయమై ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ స్పందించారు. ఈ మేరకు సీనియర్‌ మంత్రులను ఢిల్లీకి రమ్మన్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌, రాష్ట్ర ఎన్సీపీ చీఫ్‌ జయంత్‌ పాటిల్‌ ఈ రోజు మధ్యాహ్నం పవార్‌తో సమావేశమయ్యేందుకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. వారితో పాటు శివసేన సీనియర్ నేత సంజయ్‌ రౌత్‌ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. 

అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వ్యవహారంలో అరెస్టెయిన వాజేను నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని అనిల్ సూచించారంటూ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు పరంబీర్‌ సింగ్‌ లేఖ రాశారు. అంబానీ కేసులో విచారణ సరిగా చేపట్టని కారణంగా బదిలీ అయిన కొద్ది రోజులకే ఆయన ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ముంబయి క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ హెడ్‌గా ఉన్న వాజేను హోంమంత్రి దేశ్‌ముఖ్‌ కొన్ని నెలలుగా పలుమార్లు తన నివాసానికి పిలిపించుకున్నారని పరంబీర్‌ లేఖలో ప్రస్తావించారు.

తన కోసం నిధులు తీసుకురావాలని వాజేను పదేపదే ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఈ విధంగా నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారని చెప్పారు. ఆ సమయంలో అనిల్ దేశ్‌ముఖ్ వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారని పరంబీర్‌ ఆరోపించారు.

అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సహా కీలక నేతలతో సీఎం ఉద్దవ్ థాక్రే అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను రాజీనామా చేయాల్సిందిగా ఉద్దవ్ కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈయన ఆరోపణలను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఖండించారు.