జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ స్కెచ్ వేస్తారో.. ఏ స్టాండ్ తీసుకుంటారో కనీసం ఆయన నీడకు కూడా తెలియదు. ఇలాంటి నిర్ణయాలతో ప్రజల్లో, ఇతర పార్టీల్లో తన సమర్థతపై విమర్శలు వస్తున్నప్పటికీ పవర్‌స్టార్ వెనక్కి తగ్గడం లేదు.

2014కు ముందు తెలుగుదేశం పార్టీకి మద్ధతు పలికి.. మొన్నటికి మొన్న హఠాత్తుగా కూటమి నుంచి వైదొలిగి సంచలనం సృష్టించారు. నాడు ప్రచారం చేయడంతో పాటు చంద్రబాబు అండ్ కోపై ఈగ వాలనివ్వని పవన్... ఇప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ దులిపేస్తున్నారు.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా యాత్రలు జరుపుతున్న ఆయన ఉన్నట్లుండి లక్నోలో ప్రత్యక్షమయ్యారు. పవన్ వెంట ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు ఉన్నారు.. 

విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్ ఇవాళ బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలుస్తున్నారు... అనంతరం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తోన్న జనసేనాని.. ఏకంగా జాతీయ స్థాయి నేతలతో సమావేశమవుతుండటం రాజకీయ వర్గాలకు అంతుచిక్కడం లేదు.. 

బహుశా ఆయన తన పార్టీని పొలిటికల్‌గా మరింత యాక్టివేట్ చేస్తున్నట్లుగా ఉంది.. గతంలో పలు సందర్భాల్లో జనసేన తెలుగు రాజకీయాలతో పాటు జాతీయ స్థాయిలోనూ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దానిలో భాగంగానే పవన్ లక్నో వెళ్లారని విశ్లేషకుల అంచనా.. నిజానికి జనసేకకు ఏపీలో తప్ప తెలంగాణలోనూ పోటీ చసేంత బలం లేదు.. 

ఒక పక్క తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు నోటీఫికేషన్ వెలువడినా.. మిగిలిన పార్టీలు ప్రచారంలో జోరుగా ఉన్నా.. జనసేన మౌనంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన జాతీయ స్థాయిలో ఏం చేస్తుంది.

లేదంటే దళితుల పార్టీగా ముద్రపడిన బీఎస్పీ సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో ముందుకు వెళ్లడానికి సరికొత్త ఎత్తుగడ వేశారా..? లేక బీజేపీపై కారాలు మిరియాలు నూరుతున్న పవన్.. ఆ పార్టీకి వ్యతిరేకంగా జట్టుకడుతున్న కూటమిలో భాగమవుతారా..? ఇలాంటి ప్రచారాలకు ఫుల్‌స్టాప్ పడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.