హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దళితుల ఓట్లతో పాగా వేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పక్కా ప్లాన్ వేసినట్లు కనిపిస్తున్నారు. అందుకుగాను బిఎస్పీని రెండు రాష్ట్రాల్లో రంగంలోకి దించాలని ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే ఆయన బుధవారం లక్నో పర్యటన చేశారు. అయితే, బిఎస్పీ నేత మాయావతితో ఆయన సమావేశం కాలేకపోయారు.

మాయావతి అందుబాటులో లేనందున ఆ భేటీ జరగలేదు. అయితే, నాదెండ్ల మనోహర్ తో కలిసి లక్నోలో పర్యటించిన పవన్ కల్యాణ్ బిఎస్పీకి చెందిన కొంత మంది నేతలతో, మేధావులతో ఆయన సమావేశమయ్యారు. పవన్ వెంట హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బిఎస్పీతో పోటీ చేయించాలని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. బిఎస్పీకి తాను అన్ని విధాలా సహకరిస్తానని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు అగ్రవర్ణాల ఆధిపత్యమే కొనసాగుతోందని భావిస్తూ ఆ ఆధిపత్యాన్ని దెబ్బ తీయడానికి ఆ రెండు సామాజికవర్గాలకు చెందిన ప్రగతిశీల మేధావులను, బిఎస్పీని పవన్ కల్యాణ్ ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.