ఇంగ్లీష్‌ను అర్ధం చేసుకోవడంలో పోలీసులు అయోమయానికి గురికావడంతో ఓ వ్యక్తి జైల్లో మగ్గిపోయాడు. వివరాల్లోకి వెళితే బిహార్ రాజధాని పాట్నాకి చెందిన వ్యాపారి నీరజ్‌కుమార్‌పై ఆయన భార్య రెండు సార్లు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది.

దీంతో తన భార్యతో మనస్పర్థల కారణంగా ఆయన 2014లో విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం ‘‘వారెంట్’’ అనే పేరిట ఆదేశాలు జారీ చేసింది. దీనిని పోలీసులు అరెస్ట్ వారెంట్ అనుకుని నీరజ్ కుమార్‌ను నవంబర్ 25న అరెస్ట్ చేసి రాత్రంతా జైల్లో ఉంచారు.

నిజానికి కోర్టు జారీ చేసింది అరెస్ట్ వారెంట్ కాదు ‘‘డిస్ట్రెస్ వారెంట్’’... నీరజ్ తన భార్యకు భరణం చెల్లించనందున అతడి ఆస్తులు, ఆర్దిక వివరాలకు సంబంధించిన పత్రాలు న్యాయస్థానానికి సమర్పించాలని తెలిపింది..

దీనిని తప్పుగా అర్థం చేసుకున్న పోలీసులు నీరజ్‌ను జైలుకు తరలించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు నాలుక కరుచుకుని నష్టనివారణా చర్యలు చేపట్టారు. తాము ఎక్కడా వ్యాపారిని అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు.