కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయారు. దీని వల్ల కనీసం తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్నవారు కోకొల్లలు. కాగా... అలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పట్నాకు చెందిన ఓ వ్యక్తి ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు. లోన్ లో ఆటో కొనుక్కోని కుటుంబాన్ని పోషించేవాడు. కాగా..కరోనా లాక్ డౌన్ తో వారి జీవితం ఒక్కసారిగా అతలాకుతలమైంది. బయటకు వెళ్లడానికి లేదు. చేయడానికి పని లేదు. దీంతో.. కనీసం తన తండ్రి, భార్య బిడ్డలకు పట్టెడు అన్నం కూడా పెట్టలేని పరిస్థితి వచ్చింది.

ఆటో తిరగడానికి ఎలాగూ లేదు. కనీసం రోజు కూలీగా ఎక్కడైనా పని దొరుకుతుందేమో అని ప్రయత్నించాడు. కానీ అది కూడా దక్కలేదు. దీంతో మరింత డిప్రెషన్ కి గురయ్యాడు. తమ వద్ద చిల్లి గవ్వ లేకున్నా.. ఆటోకి తీసుకున్న లోన్ మాత్రం చెల్లించాల్సి వచ్చింది. దీంతో.. ఆ కుటుంబం మరింత నరకం అనుభవించింది.

ఈ క్రమంలో తట్టుకోలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. ఈ ఘటన వార్తల్లోకి రావడంతో స్థానిక రాజకీయ నాయకులు స్పందించారు. ఆటో డ్రైవర్ చనిపోతే.. అతని కుటుంబసభ్యులకు 25 కేజీల గోదుమ పిండి, కొద్దిగా బియ్యం అందించి చేతులు దులుపుకోవడం విషాదకరం. కాగా.. చనిపోయిన ఆటో డ్రైవర్ కి తండ్రి, భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా.. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మాత్రం అధికార పార్టీల నేతలపై మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. తమకు ఉన్న ఒక్క ఆధారం తమ భర్తే అని..అతన్ని కూడా కోల్పోవడంతో తమ జీవితాలు మరింత అగమ్య గోచరంగా మారాయని అతని భార్య కన్నీరు పెట్టుకుంది.