ఢిల్లీ: ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు సీబీఐ స్పెషల్ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తానికి ఒక ష్యూరిటీ ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక జడ్జి అరుణ్ భరద్వాజ్ ఆదేశించారు. ఈ కేసులో లాలూకు ఇప్పటికే తాత్కాలిక బెయిల్ మంజూరు అయ్యింది. అయితే మిగిలిన నిందితులకు గతంలోనే రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. 

లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పూరి, రాంచీలోని రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ల మెయింటెనెన్స్‌ను ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించడంలో అధికార దుర్వనియోగానికి పాల్పడినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. ఐఆర్ సీటీసీ కుంభకోణంపై విచారణ చేపట్టిన సీబీఐ 2006లో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 

ఈ కుంభకోణంలో లూలూ కుటుంబానికి భారీ మొత్తంలో ముడుపులు అందినట్టు సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ప్రస్తుతం లాలూ రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇకపోతే ఈ కేసులో లాలూ సతీమణి రబ్రీ దేవి, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు మధ్యంతర బెయిల్‌ సమయాన్ని జనవరి 28 వరకు పొడిగించినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.