ఖలిస్తాన్ వ్యతిరేక ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలపై శివసేన (హిందుస్థాన్) స్పందించింది. పంజాబ్ లోని హిందువులంతా నిరసన తెలపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పింది. 

పంజాబ్ లోని పటియాలాలో ఖలిస్తాన్ వ్యతిరేక ర్యాలీపై రెండు వ‌ర్గాల మ‌ధ్య హింసాత్మక ఘర్షణ చెలరేగిన నేప‌థ్యంలో శివసేన (హిందుస్తాన్) సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పంజాబ్ లోని హిందువులు నిరసన తెలపడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక్క‌డ ప్రజల సంఖ్య ఆధారంగా ప్ర‌భుత్వం త‌మ‌ని త‌క్కువ‌గా అంచనా వేయ‌కూడ‌ద‌ని శివసేన (హిందుస్తాన్) సంస్థ అధ్యక్షుడు పవన్ గుప్తా అన్నారు. 

శుక్ర‌వారం నెల‌కొన్న హింసకు ప్రతిస్పందనగా హిందూ సంస్థలు శ‌నివారం ఉదయం శ్రీ కాళీ దేవి ఆలయం వెలుపల ప్రదర్శన నిర్వహించాయి. కాగా శుక్ర‌వారం నాడు అనుమతి లేకుండా ఊరేగింపు చేపట్టి హింసను ప్రేరేపించినందుకు శివసేన (బాల్ ఠాక్రే) అనే రైట్ వింగ్ గ్రూప్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ సింగ్లాను పోలీసులు అరెస్టు చేశారు.

ఖలిస్తాన్ ఉద్య‌మాన్ని వ్య‌తిరేకిస్తూ మితవాద గ్రూపు శివసేన (బాల్ థాకరే) సభ్యులు శుక్రవారం సాయంత్రం పాటియాల‌లోని ఆర్యసమాజ్ చౌక్ నుండి కాళీ దేవి ఆలయం వరకు ర్యాలీ నిర్వ‌హించారు. అయితే ఆల‌యం స‌మీపంలోకి చేరుకునే స‌రికి సింగ్లా బృందం ప్రారంభించిన ర్యాలీలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. నిరసన ప్రదర్శన చేస్తున్నవారిపై నిహాంగ్లు, కొందరు సిక్కు కార్యకర్తలు కత్తులతో దాడి చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు గాలిలో అనేక రౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. అనంత‌రం కర్ఫ్యూ కూడా విధించారు.

ఈ ఘర్షణ అనంతరం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి స‌మీక్షను నిర్వ‌హించారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు. బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. ఒక్క నేరస్థుడిని కూడా వదిలిపెట్ట‌బోమ‌ని చెప్పారు. పంజాబ్ శాంతికి భంగం కలిగించేందుకు పంజాబ్ వ్యతిరేక బలగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎవరూ అల్లకల్లోలం సృష్టించనివ్వమని అన్నారు.

ఇదిలా ఉండ‌గా పంజాబ్ ప్రభుత్వం శనివారం ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పాటియాల రేంజ్), సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పాటియాలా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ల‌ను బ‌దిలీ చేసింది. వారి స్థానంలో ముఖ్విందర్ సింగ్ చిన్నా (IG), దీపక్ పారిక్ (SSP), వజీర్ సింగ్ (SP)లను నియమించింది. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఉద్రిక్త వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు, అస‌త్య వార్త‌లు ప్ర‌సారాన్ని నిలిపివేసేందుకు మొబైల్ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను కూడా నిలిపివేసింది. కాగా పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న మొద‌టి పెద్ద సంఘటన ఇది.