నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడటంపై దేశం ఉక్కసారిగా ఉలిక్కిపడింది. శనివారం నిర్వహించాల్సిన ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఏ విషయాన్ని పరిగణనలోనికి తీసుకుని కోర్టు ఈ నిర్ణయం తీసుకుందోనని పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యింది. ఈ క్రమంలో న్యాయమూర్తి ధర్మేంద్ర రానా వెలువరించిన పది పేజీల ఆర్డర్‌ను పరిశీలిస్తే.. ఈ కేసులో శిక్ష నుంచి తప్పించుకునేందుకు ముఖేశ్‌కు ఉన్న దారులు మూసుకుపోయాయన్నారు.

Also Read:ఎంతకాలం కాపాడతారు.. కన్నీరుమున్నీరైన నిర్భయ తల్లి

అయితే మిగిలిన ముగ్గురు దోషులుకు ఇంకా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భారతదేశంలోని న్యాయస్థానాలు దోషుల పట్ల ఎలాంటి వివక్ష కలిగి ఉండవని... ఇందుకు మరణశిక్ష సైతం మినహాయింపు కాదని ధర్మేంద్ర రానా పేర్కొన్నారు. కాబట్టి ముఖేశ్ ఒక్కడినే ఉరి తీయడం సాధ్యం కాదన్నారు.

జైలు మ్యాన్‌వల్‌లోని నిబంధన 836 ప్రకారం ఒకే కేసులో ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు దోషులుగా తేలినప్పుడు.. మరణశిక్ష ఎదుర్కొంటున్నప్పుడు ఒక దోషి లేదా ఆ కేసులో మిగిలిన దోషులంతా నేరుగా గానీ వారి తరపున మరెవరైనా గానీ పిటిషన్ దాఖలు చేసినట్లయితే ఉరిశిక్షను వాయిదా వేయాల్సి ఉంటుందన్నారు.

Also Read:నిర్భయ కేసు: రేపు దోషులకు ఉరిశిక్ష లేదు, కోర్టు స్టే

ఉరికంభం నుంచి తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు పక్కనబెడితే దోషులకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలు కల్పించాలని న్యాయమూర్తి తెలిపారు.

కాగా 2012 డిసెంబర్ 16న అర్థరాత్రి ఢిల్లీలో 23 ఏళ్ల విద్యార్ధినిపై కదులుతున్న బస్సులో ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, పవన్ గుప్తా, రామ్‌ సింగ్, మరో మైనర్ అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో రామ్‌సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకోగా... మైనర్ విడుదలయ్యాడు. మిగిలిన నలుగురికి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది.

ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు దోషులను ఉరితీయాల్సిందిగా ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసింది. నాటి నుంచి దోషులంతా ఒక్కొక్కరిగా క్యూరేటివ్ పిటిషన్లు, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం, రివ్యూ పిటిషన్లు దాఖలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.