బిహార్‌లో ఓ ప్యాసింజర్ ట్రైన్‌ను ట్రాక్‌పైనే నిలిపేసి అసిస్టెంట్ డ్రైవర్ లిక్కర్ తాగడానికి బయటకు వెళ్లాడు. గంటైనా తిరిగిరాలేదు. పూటుగా తాగి కనీసం నిలబడలేని స్థితికి చేరాడు. పోలీసులు వెళ్లి అతన్ని అరెస్టు చేశారు. సిగ్నల్ ఇచ్చినా ట్రైన్ కదలకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. 

పాట్నా: ఓ ప్యాసింజర్ ట్రైన్ నడుపుతున్న లోకోపైలట్ అర్ధంతరంగా ట్రైన్‌ను ట్రాక్‌పై వదిలేసి బయటకు చెక్కేశాడు. సమీపంలోని మార్కెట్‌కు వెళ్లి లిక్కర్ పుచ్చుకున్నాడు. గంట సేపు అటే వెళ్లిపోయాడు. పూటుగా తాగాడు. కనీసం నిలబడే ఓపిక లేకుండా మద్యాన్ని పుచ్చుకున్నాడు. స్టేషన్ మాస్టర్ సిగ్నల్ ఇచ్చినా ట్రైన్ కదలకపోవడంతో అనుమానాలు వచ్చాయి. గవర్నమెంట్ రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైలులోని ప్రయాణికులు అరుపులు కేకలు వేశారు. ట్రైన్ కదలకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు.

ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. సమస్తిపూర్ రైల్వే డివిజన్‌లోని హసన్న‌పూర్ స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను ముందుగా పంపించాలని, దానికి ట్రాక్ ఇవ్వడానికి అప్పుడే అక్కడకు చేరుకుంటున్న ప్యాసింజర్ ట్రైన్‌ను ఆపారు. ఇలా ట్రైన్‌ను ఆపగానే అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) కరణ్‌వీర్ యాదవ్ ఇంజిన్ బోగి నుంచి మాయమైపోయాడు. ఆయన లిక్కర్ కోసం బయటకు వెళ్లిపోయాడు.

రాజధాని ఎక్స్‌ప్రెస్ వెళ్లిపోయాక స్టేషన్ మాస్టర్ ఈ ప్యాసింజర్ ట్రైన్ కోసం అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ, ప్యాసింజర్ ట్రైన్ ముందుకు కదలలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఇంక్వైరీ చేశాడు. ఇంతలోపు ప్యాసింజర్ ట్రైన్‌లోని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో అరుపులు వేశారు.

ప్యాసింజర్ ట్రైన్‌లో అసిస్టెంట్ లోకో పైలట్ లేడన్న విషయం అర్థమైంది. దీంతో గవర్నమెంట్ రైల్వే పోలీసులను రంగంలోకి దింపారు. వారు సమీప పరిసరాల్లో ఏఎల్పీ కోసం గాలించారు. ప్యాసింజర్ ట్రైన్ ఏఎల్పీ కరణ్‌వీర్ యాదవ్ స్థానిక మార్కెట్‌లో కనిపించాడు. ఫుల్లుగా తాగి మత్తులో తూగుతూ కనిపించాడు. ఆ సమయంలో ఆయన సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉన్నాడు. పోలీసులు వెంటనే ఆయనను అరెస్టు చేశారు.

కాగా, సహర్స ఏల్పీకి స్టేషన్ మాస్టర్ మెమో ఇచ్చాడు. ఈయన కూడా అదే ట్రైన్‌లో వెళ్తున్నాడు. కాగా, ఈ ఘటనపై డివిజనల్ రైల్వే మేనేజర్ లోక్ అగర్వాల్ దర్యాప్తునకు ఆదేశించారు. 

ఈ కారణంగా ట్రైన్ ఒక గంట ఆలస్యంగా వెళ్లింది.