ఢిల్లీ వెళ్లుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబ్ ఉన్నదని హెచ్చరించాడు. ఈ బెదిరింపులతో పైలట్‌లు వెంటనే పాట్నా ఎయిర్‌పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేశారు.  

న్యూఢిల్లీ: విమాన ప్రయాణం అంటే చాలా మందికి భయం ఉంటుంది. సేఫ్‌గా టేక్ ఆఫ్ కావడం మొదలు.. అంతే సేఫ్‌గా ల్యాండ్ అయ్యే వరకు చిన్న భయం పొర మనసులో ఉంటుంది. అందుకే ఫ్లైట్‌లో ఎవ్రి మినిట్ జాగ్రత్తగా మసులుకుంటారు. ఎందుకంటే విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ఏ విపత్తు సంభవించినా.. మన చేతుల్లో ఏమీ ఉండదు. ముఖ్యంగా విమానం టేకాఫ్ అయిన తర్వాత బాంబు ఉన్నదని ఓ తోటి ప్రయాణికుడు చెబితే అప్పటి వాతావరణం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలాంటి ఘటనే ఈ రోజు ఇండిగో ఫ్లైట్‌లో చోటుచేసుకుంది.

ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌లో ఓ ప్రయాణికుడు ఉన్నట్టు ఉండి తన బ్యాగులో బాంబ్ ఉన్నదని అందరినీ హడలెత్తించాడు. దీంతో ఆ ఇండిగో ఫ్లైట్ 6ఈ-2126‌ను వెంటనే పాట్నా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. ప్రయాణికులు అందరినీ పాట్నా ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా దింపేశారు.

బాంబు స్క్వాడ్, ఇతర పోలీసు సిబ్బంది వెంటనే విమానం వద్దకు వచ్చారు. విమానంలో బాంబు కోసం గాలింపులు జరిపారు. కానీ, వారికి ఏమీ లభించలేదు. బాంబు ఉన్నదని బెదిరించిన ప్రయాణికుడి బ్యాగునూ తనిఖీ చేశారు. కానీ, అందులోనూ ఏమీ లభించలేదు. 

విమానంలో ప్రయాణిస్తుండగా బాంబు ఉన్నదని బెదిరించిన వ్యక్తిని రిశి చాంద్ సింగ్‌గా గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు రిశి చాంద్ సింగ్‌ను అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని అనుమానిస్తున్నారు. 

పాట్నా జిల్లా మెజిస్ట్రేట్ ఇండియా టుడేతో మాట్లాడుతూ, బాంబు బెదిరింపులు చేయగానే వెంటనే ఆ విమానాన్ని పాట్నా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారని వివరించారు. వెంటనే గాలింపులు జరిపించామని తెలిపారు. అయితే, ఆ విమానంలో బాంబు కనిపించలేదని తెలిపారు. ఇప్పటి వరకు విమానంలో ఏదీ కనిపించకున్నా.. ప్రొటోకాల్ ప్రకారం గాలింపులు చేస్తూనే ఉన్నామని వివరించారు. ఈ విమానాన్ని రద్దు చేశారు. రేపు ఉదయం ఈ విమానం మళ్లీ ప్రయాణం చేస్తుంది.