పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేసిన పార్థ సారథిని మంత్రి వర్గం నుంచి తొలగించారు. ఈ మేరకు బెంగాల్ కేబినెట్ సమావేశంలో నేడు నిర్ణయం తీసుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేసిన పార్థ సారథిని మంత్రి వర్గం నుంచి తొలగించారు. ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్థ చటర్జీని మంత్రి వర్గంలోని అన్ని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్స్ పెరుగుతున్న నేపథ్యంలో నేడు బెంగాల్ కేబినెట్ భేటీ అయింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్థ చటర్జీని మంత్రివర్గం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీఎంసీ సెక్రటరీ జనరల్ అయిన ఛటర్జీ రాష్ట్ర మంత్రివర్గంలో వాణిజ్యం - పరిశ్రమలు, పార్లమెంటరీ వ్యవహారాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - ఎలక్ట్రానిక్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ అండ్ ఇండస్ట్రియల్ రీకన్‌స్ట్రక్షన్ శాఖల బాధ్యతలు నిర్వహించారు.
అంతకుముంద టీఎంపీ ప్రధాన కార్యదర్శి ,అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ..పార్థ ఛటర్జీని పార్టీ నుంచి, మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ‘‘పార్థ ఛటర్జీని మంత్రివర్గం నుంచి, అన్ని పార్టీ పదవుల నుండి తక్షణమే తొలగించాలి. అతన్ని బహిష్కరించాలి. ఈ ప్రకటన తప్పు అని భావిస్తే, నన్ను అన్ని పదవుల నుండి తొలగించే హక్కు పార్టీకి ఉంది. నేను తృణమూల్ కాంగ్రెస్ సైనికుడిగా కొనసాగుతాను" అని ట్వీట్ చేశారు.

ఇక, అర్పితా ముఖర్జీకి చెందిన మరో అపార్ట్‌మెంట్‌లో ఈడీ.. రూ.28.90 కోట్ల నగదు, 5 కిలోలకు పైగా బంగారం, పలు పత్రాలను తాజాగా స్వాధీనం చేసుకుంది. గతవారం అర్పిత ముఖర్జీ ఇంట్లో రూ.21.90 కోట్ల నగదు, రూ.56 లక్షల విదేశీ కరెన్సీ, రూ.76 లక్షల విలువైన బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకన్న సంగతి తెలిసిందే. ఇక, ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు పార్థ చటర్జీని సుదీర్ఘంగా విచారణ అనంతరం గతవారం అరెస్ట్ చేశారు. మరోవైపు అర్పిత ముఖర్జీని కూడా ఈడీ అరెస్ట్ చేసింది.
ఇక, ఈ కేసు బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇబ్బందుల్లోకి నెట్టింది. సీఎం మమతా బెనర్జీ టార్గెట్‌గా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు దోషులుగా తేలితే బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీ ఇదివరకే చెప్పారు. టీఎంపీపై బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు.
