మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు, ప్రకటించిన సోనియా.. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్..

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ తరఫున తాను మద్దతిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ చెప్పారు. 

Parliament Special Session Rajiv Gandhi dream to get Women Reservation Bill passed says Sonia Gandhi ksm

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ తరఫున తాను మద్దతిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చకు అనుమతించారు. తొలుత కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ.. ఈ బిల్లు మహిళల గౌరవం, అవకాశాల సమానత్వాన్ని పెంచుతుందని అన్నారు. మహిళలకు ప్రాతినిధ్యం లభిస్తుందని.. ఈ బిల్లులో నాలుగు ముఖ్యమైన క్లాజులు ఉన్నాయని వివరించారు. 

అనంతరం సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘‘భారత జాతీయ కాంగ్రెస్ తరపున.. నేను మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం 2023)కు మద్దతుగా నిలబడతాను’’ అని చెప్పారు. వంటిల్లు నుంచి ప్రపంచ వేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉందని అన్నారు. మహిళలు వారి స్వార్దం గురించి ఏనాడూ ఆలోచించరని చెప్పారు. మహిళల త్యాగాలు ఎనలేనివని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని అన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి మహిళలు పోరాడారని గుర్తుచేశారు. సరోజిని నాయుడు, సుచేత కృపలానీ, అరుణ అసఫ్ ఆలీ, విజయలక్ష్మి పండిత్, వంటి వారెందరో దేశం కోసం పోరాడారని గుర్తుచేశారు. 

‘‘ఇది నా జీవితంలో కూడా భావోద్వేగ ఘట్టం. తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించే రాజ్యాంగ సవరణను నా జీవిత భాగస్వామి రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు. రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని ప్రభుత్వం దీనిని రాజ్యసభలో ఆమోదించింది. ఫలితంగా స్థానిక సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మహిళా నాయకులు ఉన్నారు. రాజీవ్ గాంధీ కల పాక్షికంగా మాత్రమే పూర్తయింది. సభలో ఈ బిల్లు ఆమోదం పొందితే రాజీవ్ గాంధీ కల  పూర్తి అవుతుంది’’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు. 

మహిళలు ఇప్పటికే ఈ బిల్లు కోసం ఎదురు చూస్తున్నారని.. ఇప్పుడు వారు ఇంకెన్నాళ్లు వేచి ఉండాలని ప్రశ్నించారు. ఈ బిల్లును తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. కుల గణన చేపడితే.. ఈ బిల్లు మెరుగైన అమలుకు దారితీస్తుందని అన్నారు. బిల్లు మరింత మెరుగ్గా అమలు కావాలంటే కుల గణన అవసరమని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మహిళలను కూడా చేర్చాలని కోరారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios