పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు..: ప్రధాని మోదీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా ప్రధాని మోదీ చెప్పారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా ప్రధాని మోదీ చెప్పారు. ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. భారత్ చేపట్టిన మూన్ మిషన్ విజయవంతం అయిందని.. చంద్రయాన్-3 మన తిరంగను ఎగురవేసిందని, శివశక్తి పాయింట్ ఒక కొత్త స్ఫూర్తి కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. తిరంగా పాయింట్ మనలో గర్వాన్ని నింపుతోందని అన్నారు.
జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించాలని ప్రధాని మోదీ చెప్పారు. జీ20 సదస్సు సందర్భంగా మనం గ్లోబల్ సౌత్ వాయిస్‌గా మారినందుకు, ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యత్వం పొందినందుకు భారతదేశం ఎల్లప్పుడూ గర్విస్తుందని తెలిపారు. ఇదంతా భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతమని పేర్కొన్నారు. 'యశోభూమి' అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ కూడా నిన్న దేశానికి అంకితం చేయబడిందని మోదీ చెప్పారు. భారత పురోగతిని ప్రపంచం కొనియాడుతుందని అన్నారు.
ఈ పార్లమెంటు సమావేశాలు చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ.. చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా మోదీ తెలిపారు. రేపు గణేష్ చతుర్థి సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనానికి తరలివెళ్తామని చెప్పారు. వినాయకుడిని 'విఘ్నహర్త' అని కూడా అంటారని.. ఇప్పుడు దేశాభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవని అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలు తక్కువ వ్యవధి ఉండవచ్చని.. కానీ ఇది చరిత్రాత్మకంగా నిలవనున్నట్టుగా చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని మోదీ కోరారు.
ఇక, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మొదటి రోజు (సోమవారం) లోక్‌సభలో ‘‘సంవిధాన్ సభ నుంచి ప్రారంభమైన 75 సంవత్సరాల పార్లమెంటరీ ప్రయాణం- విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అభ్యాసాలు’’పై చర్చను నిర్వహించనున్నారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్ కూడా జాబితా చేయబడింది. అయితే ఈ చర్చలో భాగంగా ప్రధాని మోదీ ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమైన తర్వాత.. లోక్‌సభలో ప్రసంగించనున్నారు. ఇదే అంశంపై రాజ్యసభలో జరిగే చర్చలో బీజేపీ సీనియర్ నేత పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు.