పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ..
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో బీజేపీ నాయకత్వం ఆ పార్టీ ఎంపీలకు విప్ జారీచేసింది.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో బీజేపీ నాయకత్వం ఆ పార్టీ ఎంపీలకు విప్ జారీచేసింది. ఎంపీలు సభకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ముఖ్యమైన శాసనపరమైన వ్యవహారాలను చర్చించడానికి, ప్రభుత్వ వైఖరికి మద్దతు ఇవ్వడానికి ఎంపీలు తప్పకుండా హాజరు కావాలని కోరింది.
సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే ఐదు రోజుల పార్లమెంట్ సమావేశాల్లో.. మొదటి రోజు సంవిధాన్ సభ నుంచి 75 ఏళ్ల పార్లమెంటు ప్రయాణంపై ప్రభుత్వం ప్రత్యేక చర్చను జాబితా చేసింది. ఈ సెషన్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును కూడా ప్రభుత్వం పరిశీలనకు, ఆమోదించేందుకు జాబితా చేసింది. అయితే గత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
ఇక, లోక్‌సభకు సంబంధించిన ఇతర లిస్టెడ్ బిజినెస్‌లలో 'ది అడ్వకేట్స్ (సవరణ) బిల్లు, 2023', 'ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023' ఉన్నాయి. వీటిని ఇప్పటికే ఆగస్టు 3వ తేదీన రాజ్యసభ ఆమోదించింది.అంతేకాకుండా 'పోస్టాఫీస్ బిల్లు, 2023' కూడా లోక్‌సభ బిజినెస్‌లో జాబితా చేయబడింది. ఈ బిల్లును ఆగస్టు 10వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
ఇదిలాఉంటే, ప్రస్తుతం పేర్కొన్న జాబితా తాత్కాలికమైనదని, మరిన్ని అంశాలను జోడించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక, ఈ సెషన్‌లో పాత భవనం నుంచి కొత్త పార్లమెంటు భవనానికి పార్లమెంట్ కార్యకలాపాలు మారే అవకాశం ఉంది.