Parliament Special Session 2023: నేటి నుండి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ప్రత్యేక అజెండా.. కీలక బిల్లులు..
Parliament Special Session 2023: నేటి నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక సమావేశానికి ప్రభుత్వం కీలక ఏర్పాట్లు చేసింది. ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల్లో మొదటి రోజు 75 ఏళ్ల పార్లమెంటు ప్రయాణంపై చర్చ జరగనుంది.

Parliament Special Session 2023: పార్లమెంట్ ఐదు రోజుల ప్రత్యేక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు పార్లమెంట్ కార్యకలాపాలు పాత పార్లమెంట్ హౌస్ లో ప్రారంభం కాగా.. మరుసటి రోజు కొత్త పార్లమెంట్ హౌస్‌లో జరగనున్నాయి. ప్రత్యేక సమావేశానికి ప్రభుత్వం కీలక ఏర్పాట్లు చేసింది.
75 ఏళ్ల పార్లమెంట్ ప్రయాణంపై చర్చ
ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల్లో మొదటి రోజు పార్లమెంట్ 75 ఏళ్ల ప్రయాణంపై చర్చ జరుగనున్నది. పార్లమెంటరీ బులెటిన్ ప్రకారం.. మొదటి రోజు 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంలో సాధించిన విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు చర్చించబడతాయి. దీనితో పాటు, పోస్టాఫీసు బిల్లు 2023, ప్రధాన ఎన్నికల కమిషనర్, మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులను ఐదు రోజుల సెషన్‌లో సమర్పించనున్నారు. అంతేకాకుండా.. న్యాయవాదుల (సవరణ) బిల్లు 2023, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు.
ఐదు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల చివరి మూడు రోజుల్లో మాత్రమే ప్రభుత్వం ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కోసం బీజేపీ ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరికీ విప్ జారీ చేసింది.
అఖిలపక్ష సమావేశ ఏర్పాటు
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అన్ని పార్టీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంపై దృష్టి సారించారు. అఖిలపక్ష సమావేశం గురించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. సమావేశంలో అన్ని పార్టీలు వేర్వేరు డిమాండ్లను లేవనెత్తాయని, అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభానికి ముందు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ఆదివారం కొత్త పార్లమెంట్ హౌస్ ప్రాంగణ గేటు వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. కొత్త భవనంలో సభ ప్రారంభానికి ముందు సన్నాహకానికి దీన్ని అనుసంధానం చేస్తున్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా, మైలురాయిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, భారతదేశం యుగంలో మార్పును చూస్తోందని అన్నారు. భారతదేశ శక్తి, సామర్థ్యం, సహకారాన్ని ప్రపంచం పూర్తిగా గుర్తిస్తోందని అన్నారు.
మనం కలలో కూడా ఊహించని అభివృద్ధిని, విజయాలను నేడు మనం చూస్తున్నామని అన్నారు. మన గ్రౌండ్ రియాలిటీ నేడు ప్రపంచంలో అత్యంత సానుకూల రీతిలో ప్రతిబింబిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, రాజకీయ పార్టీల ఎంపీలు, ఉభయ సభల అధికారులు పాల్గొన్నారు.