న్యూఢిల్లీ:నవ భారత్ నిర్మాణం కోసం ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్  చెప్పారు.  గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయి సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. 

పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం నాడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంనాడు ప్రారంభమయ్యాయి.

పార్లమెంట్ ‌ భవనానికి చేరుకొన్న రాష్ట్రపతికి ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు మంత్రులు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు.

గత పార్లమెంట్ సమావేశాలు కొత్త రికార్డును నెలకొల్నిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ తీర్పే  అంతిమం అని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రకారంగా పనిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారాయన.తమ ప్రభుత్వానికి ప్రజలు విస్పష్ట తీర్పును ఇచ్చిన విషయాన్ని  ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ దశాబ్దం ఎంతో కీలకమైందని ఆయన అభిప్రాయపడ్డారు. 

జమ్మూ కాశ్మీర్, లడఖ్, ప్రజలకు దేశ ప్రజలతో సమానంగా హక్కులు సంభవించిన విషయాన్ని రాష్ట్రపతి కోవింద్ గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ పథకాలతో ప్రస్తుతం లబ్ది పొందుతున్నారన్నారు. వ్యాలీలో వివిధ విద్యాసంస్థలు  ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆయన చెప్పారు.

కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభించడం చరిత్రాత్మకమైందిగా కోవింద్ అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల్లో భారత్‌విశేష ప్రగతిని సాధించిందని కోవింద్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.గత ఐదేళ్లలో భారత్ అన్ని రంగాల్లో మెరుగైన ఫలితాలను సాధించిందన్నారు.ఈ దశాబ్దంలో దేశం ఉన్నత శిఖరాలను అందుకొంటుందని  రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. హింస వల్ల దేశ ప్రతిష్ట దిగజారుతోందన్నారు. 

ఆర్టికల్ 370 రద్దు గొప్ప నిర్ణయమని రాష్ట్రతిరామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. ముస్లిం మహిళలకు న్యాయం చేసేలా ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రామజన్మభూమిపై సుప్రీం తీర్పుపై ప్రజల ఔన్నత్యాన్ని రాష్ట్రపతి కోవింద్ ప్రశంసించారు. 

సీఏఏతో బాపూజీ కల నెరవేరిందని రాష్ట్రపతి కోవింద్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌లో మైనార్టీలను ఆ దేశం టార్గెట్ చేసిన విషయాన్ని రాష్ట్రపతి ప్రస్తావించారు. నన్‌కానా షాహిబ్ ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా రాష్ట్రపతి చెప్పారు.

రైతుల  ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు. కిషాన్ సమ్మాన్ నిధితో 8 కోట్ల మంది రైతులు లబ్దిపొందిన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు.ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కృషి చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఎన్నో అంతర్జాతీయ ర్యాంకుల్లో ఇండియా అగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని రాష్ట్రపతి ప్రస్తావించారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకులను ఆయన ప్రస్తావించారు.  గిరిజనుల అభివృద్ది కోసం ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు. దివ్యాంగుల గుర్తింపు కోసం ఐడెంటిటీకార్డులను జారీ చేసినట్టుగా ఆయన చెప్పారు.

డిజిటల్ ఇండియా స్కీంతో గ్రామీణ భారతానికి  ప్రయోజనం చేకూరుతోందన్నారు రాష్ట్రపతి వన్ నేషన్, వన్ మొబిలిటితో లక్షలాది మందికి లబ్ది చేకూరుతోందన్నారు.

రైతుల సంక్షేమం కోసం రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 12 వేలను జమ చేస్తున్నామని రాష్ట్రపతి చెప్పారు. దేశంలో సుమారు రెండున్నర కోట్ల మందికి ఉచిత విద్యుత్ ను అందిస్తున్నట్టుగా రాష్ట్రపతి చెప్పారు. ఈ ఏడాది కొత్తగా 75 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు.24 కోట్ల మందికి ఉచితంగా  వైద్య సేవలను అందిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

మేకిన్ ఇండియాతో దేశంలో ఉత్పత్తి రంగం పుంజుకొన్న విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు. టూరిజంపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా కేంద్రీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ముద్రా పథకం కింద 54 లక్షల మందికి రుణాలు ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు.