Asianet News TeluguAsianet News Telugu

షెడ్యూల్ కంటే ముందుగానే పార్లమెంటు సమావేశాలు ముగింపు!

పార్లమెంటు సమావేశాలు వారం రోజులు ముందుగానే ముగిసిపోనున్నట్టు తెలుస్తున్నది. క్రిస్మస్, నూతన సంవత్సరం సంబురాల నేపథ్యంలో ప్రతిపక్ష నేతల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకోవచ్చు.
 

parliament session to end one week early on friday says sources
Author
First Published Dec 20, 2022, 3:34 PM IST

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు షెడ్యూల్ కంటే ముందుగానే ముగియనున్నట్టు తెలుస్తున్నది. ఒక వారం ముందుగానే ఈ సమావేశాలు ముగియనున్నట్టు కొన్ని వర్గాలు వివరించాయి. లోక్‌సభ, రాజ్యసభల షెడ్యూల్ మేనేజ్ చేసే బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ గురించి ఆ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సారథ్యంలో ఈ సమావేశం జరిగింది. పలువురు ప్రతిపక్ష నేతలు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సమావేశాలను ముందుగానే ముగించాలని ప్రభుత్వం, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేసినట్టు వివరించాయి.

ఈ నెల 7వ తారీఖు మొదలైన పార్లమెంటు సమావేశాలు ఈ నల 29వ తేదీ వరకు జరగాల్సి ఉన్నది. కానీ, ఒక వారం ముందుగానే శుక్రవారం ముగిసే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య వేడి వేడిగా వాగ్యుద్ధం జరుగుతున్నది.

భారత్, చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణల గురించి చర్చించాలని ప్రతిపక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఈ ఘర్షణల గురించి ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటనలో వెలువరించింది. అనంతరం, దీనిపై సమగ్ర చర్చ జరపాలని డిమాండ్ చేసింది. కానీ, ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దానికి బదులు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభ, రాజ్యసభలలో ప్రకటన చేశారు. ఈ ఘర్షణల్లో భారత సైన్యం నష్టపోలేదని వివరించారు. చైనా ఆర్మీ ఎల్ఏసీ దాటి భారత్‌లోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించారని తెలిపారు. వారిని భారత ఆర్మీ సమర్థంగా నిలువరించింది.

Also Read: దేశ ఆర్థిక సూచికలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.. వాటిపై చ‌ర్చ జ‌ర‌గాల్సిందే: ఆప్ నాయ‌కుడు రాఘవ్ చద్దా

అదే విధంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై విమర్శలు చేశారు. ఆర్మీని చితక్కొట్టారనే పదం సరికాదని, అది వారికి గౌరవాన్ని ఇవ్వదని మండిపడ్డారు. 

తాజాగా, రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీజేపీకి మధ్య హాట్ హాట్‌గా కామెంట్లు జరిగాయి. రాజస్తాన్‌లోని అల్వార్ సభలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం కాంగ్రెస్ పార్టీ తెచ్చి పెట్టిందని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటివారు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని వివరించారు. దేశం కోసం వారి ఇంటి కుక్క అయినా సరే మరణించడం మీరేమైనా చూశారా? అని ప్రశ్నించారు. అయినా వారికి వారే దేశ భక్తులుగా చిత్రించుకుంటారని, తాము ఏది మాట్లాడినా దేశద్రోహం అని దబాయిస్తారని అన్నారు. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రను, భారత్ తోడో యాత్రగా బీజేపీ కామెంట్ చేయడంపై ఆయన మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభలో నిలదీశారు. క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి పియుశ్ గోయల్ డిమాండ్ చేశారు. తాను క్షమాపణలు చెప్పబోనని ఖర్గే స్పష్టం చేశారు. అతను పార్లమెంటు బయట చేసిన వ్యాఖ్యలు అవి అని రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ పేర్కొన్నారు. కాబట్టి వాటిపై ఇక్కడ చర్చ అనవసరం అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios