Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలువురు అధికార, విపక్ష నేతలు హాజరయ్యారు. అయితే, ప్ర‌ధాని మోడీ రాక‌పోవ‌డంపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయింది.  

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనిపై చర్చించేందుకు ముందుగా ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు, పలువురు బీజేపీ నేతలు కూడా ఉన్నారు. ఢిల్లీలోని పార్లమెంటు భవనంలోని పాత భవనంలో ఈ సమావేశం జరుగుతోంది. జూలై 18 (సోమవారం) నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల స‌మావేశాలు ఆగస్టు 12న ముగియనున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం ప‌లు బిల్లుల‌ను తీసుకురావ‌డానికి సిద్ధ‌మవుతోంది. అందులో 24 బిల్లులు ఉన్న‌ట్టు స‌మాచారం. 

ప్ర‌ధాని మోడీ రాక‌పోవ‌డంపై కాంగ్రెస్ ప్ర‌శ్న‌లు 

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల‌కు ముందు జ‌రిగే అఖిలప‌క్ష స‌మావేశాన్ని ఆదివారం నాడు నిర్వ‌హించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన ఈ స‌మావేశం జ‌రిగింది. అయితే, ఈ అఖిలపక్ష సమావేశానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రాలేదు. దీంతో కాంగ్రెస్ ఫైర్ అయింది. పీఎ ఎందుకు రాలేదంటూ ప్ర‌శ్నించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్ర‌ధాని మోడీ రాలేద‌న్న‌ ప్రశ్న లేవనెత్తారు. ఇది అన్‌పార్లమెంటరీ కాదా అని ట్వీట్ చేశారు. జైరాం రమేష్ తన ట్వీట్‌లో, 'రాబోయే పార్లమెంట్ సమావేశాల గురించి చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఇప్పుడే ప్రారంభమైంది. ఎప్పటిలాగే ప్రధాని గైర్హాజరు కావడం 'అన్‌పార్లమెంటరీ' కాదా? అని ప్ర‌శ్నించారు. 

త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ప్రారంభం కాగా, ప్రధాని ఎప్పటిలాగే గైర్హాజరయ్యారు. ఇది 'అన్‌పార్లమెంటరీ' కాదా? అంటూ జైరాం రమేష్ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…


రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన‌.. 

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, జైరాం రమేష్, డీఎంకే నేతలు టీఆర్ బాలు, టీఎంసీ నేతలు సుదీప్ బందోపాధ్యాయ, శివసేన నేతలు సంజయ్ రౌత్, ఎన్సీపీ నేతలు శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, ఆప్ నేతలు సంజయ్ సింగ్‌తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. వీరితో పాటు టీడీపీ, ఎస్పీ, బీఎస్పీ, సీపీఎం, ఆర్‌ఎస్పీ, ఆర్జేడీ నేతలు కూడా సమావేశంలో ఉన్నారు.

స‌భ్యులు స‌హ‌క‌రించాలి: స్పీక‌ర్ 

వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వర్షాకాల సమావేశంలో మొత్తం 18 సమావేశాలు ఉంటాయని, మొత్తం సెషన్ 108 గంటలు ఉంటుందని ఇప్పటికే పార్లమెంటు సభ్యులకు చెప్పారు. సభ మర్యాద, గౌరవం, క్రమశిక్షణను కాపాడేందుకు సభ్యులు సహకరించాలని ఆయన కోరారు. కాగా, ప్ర‌భుత్వం 24 బిల్లులు తీసుకురావ‌డానికి సిద్ధ‌మ‌వుతుండ‌గా, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఈ వర్షాకాల సమావేశాల్లో నిరుద్యోగం, అగ్నిపథ్ పథకం, రైతులకు సంబంధించిన అంశాలను లేవ‌నెత్త‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి.