పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని కొందరు నేతలు తమ పార్టీల తరపున పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిని, లోక్‌సభ స్పీకర్‌ను, రాజ్యసభ చైర్మన్‌ను కోరారు

శాసన సభ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను కుదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 8న ప్రారంభమైన ఈ సమావేశాలు ఈ నెల 25తో ముగిసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముందుగా ప్రకటించిన వివరాల ప్రకారం ఈ సమావేశాలు ఏప్రిల్ 8 వరకు జరగవలసి ఉంది. అయితే ఈ సమావేశాలు గురువారం నిరవధికంగా వాయిదా పడవచ్చునని విశ్వసనీయ సమాచారం. 

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి శాసన సభలకు మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎన్నికలు జరుగుతాయి. మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా పాల్గొంటున్నారు. పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయాలని కొందరు నేతలు తమ పార్టీల తరపున పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిని, లోక్‌సభ స్పీకర్‌ను, రాజ్యసభ చైర్మన్‌ను కోరారు. టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ మేరకు ఓ లేఖ రాశారు. టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ రాజ్యసభ చైర్మన్‌ ఎం వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాలను కుదించాలని కోరారు. 

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి దశ జనవరి 29న ప్రారంభమైంది, పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. తొలి దశ సమావేశాలు ఫిబ్రవరి 29న ముగిశాయి