Parliament Monsoon Session2022: ద్రవ్యోల్బణం, అగ్నిపత్ యోజన వంటి ఆంశాలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశాయి. ఈ ప్రదర్శనలో కాంగ్రెస్ పలువురు నేతలు పాల్గొన్నారు. మరోవైపు.. సభలో ఆందోళనలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు
Parliament Monsoon Session 2022: పార్లమెంట్ వర్షకాల సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. నేడు రెండో రోజు సమావేశాలు జరిగాయి. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జిఎస్‌టి, అగ్నిపథ్ స్కీమ్‌లకు వ్యతిరేకంగా లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్లమెంటు ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ఈ నిరసనలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నుండి అధీర్ రంజన్ చౌదరి మరియు మల్లికార్జున్ ఖర్గే సహా చాలా మంది పెద్ద నాయకులు చేతిలో బ్యానర్లతో గాంధీ విగ్రహం దగ్గర గుమిగూడారు. ఇవాళ వర్షాకాల సమావేశాల సందర్భంగా విపక్షాలు వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి.
దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్లకార్డులతో స్పీకర్ ను చుట్టుముట్టారు. దీన్ని స్పీకర్ ఓం బిర్లా ఖండించారు. ఇది నిబంధనలకు వ్యతిరేకమనీ, సభలోకి ప్లకార్డుల అనుమతి లేదన్నారు. ఇటు రాజ్యసభ, అటు లోక్‌సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.
వాస్తవానికి సాయుధ బలగాలకు అగ్నిపథ్ పథకం, జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై చర్చించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేతోపాటు పలువురు నేతలు నోటీసులు ఇచ్చినా అంగీకరించలేదు. తొలిరోజు (సోమవారం) కూడా ప్రతిపక్షాలు ద్రవ్యోల్బణంతో సహా అగ్నిపథ్ పథకంపై చర్చ జరగాలని సభల్లో డిమాండ్ చేశాయి.
రాజ్యసభ స్పీకర్ వెంకయ్య నాయుడు అధ్యక్షతన మాట్లాడుతూ, తన పదవీకాలంలో 57 శాతం సభలు పూర్తిగా లేదా పాక్షికంగా అంతరాయం కలిగించాయని అన్నారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణం సమస్యపై టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు కూడా బైఠాయించారు.
