పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహణకు కేంద్రం సిద్దమైంది. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జూలై మూడో వారం నుంచి ప్రారంభమవుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహణకు కేంద్రం సిద్దమైంది. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జూలై మూడో వారం నుంచి ప్రారంభమవుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆగస్టు 10వ తేదీన ఈ సమావేశాలు ముగిసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఒకటి రెండు రోజుల్లో తేదీలను ఖరారు చేయనుంది. అయితే కేబినెట్ కమిటీ ముందు ప్రతిపాదించిన తేదీల ప్రకారం.. జూలై 17 లేదా జూలై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై.. ఆగస్టు 10న ముగియవచ్చని ఆ వర్గాలు తెలిపాయి.
అయితే ఈ సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో సాగనున్నాయా? లేదా ప్రస్తుతం ఉన్న భవనంలోనే కొనసాగుతాయా? అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల రోజులక్రితం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినప్పటికీ.. అందులో ఇంకా కొన్ని పనులు కొనసాగుతున్నాయి. కొత్త పార్లమెంటు భవనం సమావేశాలను నిర్వహించడానికి పూర్తిగా సిద్ధం కాకపోతే.. వాటిని పాత భవనంలో నిర్వహించే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఆ వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశాల్లో ఢిల్లీపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రధానంగా నిలిచే అవకాశం ఉంది. ఇందుకు వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. అయితే ఈ బిల్లుపై కాంగ్రెస్ ఇంకా తన వైఖరిని ప్రకటించలేదు. అయితే లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ ఉన్నందున బిల్లు సులభంగా ఆమోదం పొందనుంది. ఇక, రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ, నామినేటెడ్ సభ్యుల మద్దతుతో 111 మంది సభ్యుల బలం ఉంది. మరోవైపు ప్రతిపక్షాల ఉమ్మడి బలం 106గా ఉంది. ఇక, వైసీపీ, బీజేడీ, బీఎస్‌పీ టీడీపీ, జేడీఎస్ వంటి బీజేపీ స్నేహపూర్వక పార్టీలకు 21 మంది సభ్యులు ఉన్నారు. ఇతర ప్రతిపక్ష పార్టీల వలే వీరు ఆప్‌కు మద్దతు ప్రకటించలేదు.
