పార్లమెంట్‌లో మణిపూర్ మంటలు.. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వం చర్చకు సిద్దమన్న పీయూష్ గోయల్..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేస్తుంది. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన చేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేస్తుంది. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన చేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది. అంతేకాకుండా లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా ఇచ్చాయి. అయితే అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. అన్ని పక్షాలతో చర్చించిన తర్వాత చర్చకు సమయం నిర్ణయించనున్నట్టుగా ప్రకటించారు. అయితే ప్రతిపక్ష కూటమి ఇండియా మాత్రం.. మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూనే ఉంది.
ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కాగా.. మరోసారి మణిపూర్ అంశంపై విపక్షాలు చర్చకు ఒత్తిడి తీసుకొచ్చారు. 267 నిబంధన ప్రకారం మణిపూర్ సంక్షోభంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
ఇక, రాజ్యసభలో కూడా మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే స్పందించిన రాజ్యసభలో సభానాయకుడు పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ‘‘ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంటులో మణిపూర్‌పై చర్చలు జరగాలని మేము కోరుకుంటున్నాము. వారు (ప్రతిపక్షాలు) సభ్యులకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మణిపూర్‌పై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే వారు (ప్రతిపక్షాలు) ఇప్పటికే 9 ముఖ్యమైన రోజుల సభ సమయాన్ని దుర్వినియోగం చేశారు’’ అని పేర్కొన్నారు.
అయితే 267వ నిబంధన కింద చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సమగ్రమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల ఆందోళనతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్.. సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.