మణిపూర్ హింసపై నిరసన: పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా
మణిపూర్ హింసపై పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై విపక్షాలు నిరసనకు దిగారు. పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమయ్యాయి.పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి మణిపూర్ అంశంపై విపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయమై ప్రధాన మంత్రి మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ కూడ పార్లమెంట్ ఉభయ సభల్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.
లోక్ సభ ప్రారంభమైన వెంటనే మణిపూర్ అంశంపై విపక్షాలు నిరసనకు దిగాయి. అన్ని అంశాలను పక్కన పెట్టి మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్ సభను స్పీకర్ ఓంబిర్లా వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్ సభను వాయిదా వేశారు స్పీకర్. లోక్ సభలో విపక్ష సభ్యులు మణిపూర్ హింసపై ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. మధ్యాహ్నం లోక్ సభ ప్రారంభమైన వెంటనే సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.విపక్ష సభ్యుల నిరసనల మధ్యే మైనింగ్ సవరణ 2023 బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులతో పాటు పలు బిల్లులకు లోక్ సభ ఆమోదం తెలిపింది.అనంతరం లోక్ సభ సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.
ఇదిలా ఉంటే రాజ్యసభలో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. మణిపూర్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్ కర్ ప్రకటించారు. ఈ సమయంలో టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్ , రాజ్యసభ చైర్మెన్ మధ్య వాదోపవాదాలు జరిగాయి.దీంతో రాజ్యసభను సోమవారం వరకు వాయిదా వేశారు రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్ కర్.