న్యూఢిల్లీ: రాఫెల్ డీల్‌ విషయమై  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ  చేసిన వ్యాఖ్యలతో పాటు ఓ  ఆడియోను విన్పిస్తానని చేసిన కామెంట్‌తో లోక్‌సభలో  బుధవారం నాడు తీవ్ర గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకొన్నారు. సభను కంట్రోల్ చేసేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభను కొద్దిసేపు వాయిదా వేశారు

బుధవారం నాడు లోక్‌సభలో  రాఫెల్ ఒప్పందంపై చర్చను కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ  ప్రారంభించారు. రాఫెల్ ఒప్పందంపై రాహుల్ గాంధీ అనేక ఆరోపణలు చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ తరపున  ఇవాళ జరిగిన చర్చలో  రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

రాఫెల్ కుంభకోణంలో అవినీతి చోటు చేసుకొందని కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ మరోసారి ఆరోపించారు. పార్లమెంటరీ ప్యానెల్ చేత విచారణ జరిపించాలని  కాంగ్రెస్ పార్టీ  డిమాండ్ చేసింది.

రాఫెల్ ఒప్పందంపై ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని రాహుల్ గాంధీ కోరారు. రాఫెల్ కేసును జేపీసీకి అప్పగించాలన్నారు.రాఫెల్ కుంభకోణంపై ప్రధాని సమాధానం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోందని రాహుల్ అభిప్రాయపడ్డారు.  రాఫెల్ యుద్ద విమానాలు  అత్యవసరమైనప్పుడు ఒకక్కటీ కూడ ఎందుకు రాలేదని రాహుల్ ప్రశ్నించారు.

రాఫెల్ యుద్ద విమానాల సంఖ్యను 126 నుండి 36కు ఎందుకు తగ్గించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విమానాల సంఖ్య తగ్గించమని ఎయిర్‌ఫోర్స్ కోరిందా అని రాహుల్ ప్రశ్నించారు.

70 ఏళ్లుగా విమానాలను తయారు చేస్తున్న హెచ్ఎఎల్ సంస్థను ఈ డీల్‌ నుండి ఎందుకు తప్పించారో చెప్పాల్సిందిగా రాహుల్ కోరారు. రాఫెల్ డీల్‌లో ధరల మతలబు ఏమిటని రాహుల్ ప్రశ్నించారు.

ఈ డీల్‌కు పది రోజుల ముందే కంపెనీ పెట్టిన అనిల్ అంబానికీకి కాంట్రాక్టు ఎలా ఇచ్చారని రాహుల్ నిలదీశారు.రాఫెల్ డీల్‌లో అనేక లోసుగులు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. గంటన్నర ప్రధాని ప్రసంగంలో కనీసం ఐదు నిమిషాలు కూడ రాఫెల్ కూడ మాట్లాడలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు.

మోడీ నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి రాహుల్ ప్రస్తావించారు.  ఓ ఆడియో రికార్డులను చదివి విన్పించేందుకు రాహుల్ స్పీకర్ అనుమతి కోరారు.
  అయితే స్పీకర్ ఈ విషయమై అనుమతి ఇవ్వలేదు.

రాహుల్ ప్రసంగిస్తున్న సమయంలో  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ జోక్యం చేసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాందీ చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. రాఫెల్ డీల్‌ విషయమై సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అంతేకాదు సభలో ఆడియో రికార్డింగ్స్ వినిపించేందుకు  వీల్లేదని అరుణ్ జైట్లీ అభ్యంతరం తెలిపారు. దీంతో  సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సభ్యులు  తమ తమ వాదనలను విన్పించే ప్రయత్నం చేశారు. రెండు పార్టీలకు చెందిన సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేశారు. సభను కంట్రోల్ చేసేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్  ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు  స్పీకర్ పోడియం  వద్దకు చేరుకొని నినాదాలు చేశారు.సభను కంట్రోల్ చేసేందుకు గాను  స్పీకర్  లోక్‌సభను  కొద్దిసేపు వాయిదా వేశారు.