న్యూఢిల్లీ:  విదేశాల్లో నల్లధనం దాచుకొన్న వాళ్ల వివరాలను సేకరిస్తున్నట్టుగా రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్  ప్రకటించారు. అవినీతి అంతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  నల్లధనానికి వ్యతిరేకంగా ప్రారంభించిన కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

గురువారం నాడు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు.తొలుత  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, లోక్‌సభ స్పీకర్ తో పాటు పలువురు మంత్రులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు.

గతంతో పోలిస్తే ఈ దఫా పార్లమెంట్‌లో మహిళా ఎంపీల సంఖ్య పెరిగిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చెప్పారు.ఈ దఫా  పార్లమెంట్ లో మహిళా ఎంపీల సంఖ్య బాగా పెరిగిందన్నారు. దాదాపు పురుషులతో సమానంగా  మహిళా ఎంపీలు పార్లమెంట్‌లో అడుగుపెట్టారని ఆయన చెప్పారు.

కొత్తగా ఎన్నికైన ఎంపీలకు  ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో ఉన్న ఎంపీల్లో సగం మంది తొలిసారి ఎంపికైన వాళ్లేనని రాష్ట్రపతి చెప్పారు.ఈ దఫా గతంతో పోలిస్తే యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు చాలా స్పష్టమైన తీర్పును ఇచ్చారని ఆయన చెప్పారు.2014 నుండి కొనసాగుతున్న ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇచ్చారన్నారు.

2014కు ముందు దేశంలో ఉన్న పరిస్థితుల నుండి దేశాన్ని బయటకు తీసుకురావాలని జనం భావించారని ఆయన అభిప్రాయపడ్డారు.శక్తివంతమైన భారతదేశం నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్టుగా రాష్ట్రపతి చెప్పారు.రైతుల గౌరవం పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన తెలిపారు. 60 ఏళ్లు దాటిన రైతులకు  పెన్షన్  అందిస్తున్నట్టుగా రాష్ట్రపతి ప్రకటించారు.

రైతుల గౌరవాన్ని పెంచేందుకు  ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్న విషయాన్ని రాష్ట్రపతి ప్రకటించారు. మూడు దశాబ్దాల తర్వాత పూర్తిమెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటైన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు  చేశారు.

అమరజవాన్ల పిల్లల స్కాలర్‌షిప్‌లను పెంచినట్టుగా ఆయన చెప్పారు. సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అనే నినాదంతో  తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టుగా రాష్ట్రపతి వివరించారు. జలసంరక్షణ కోం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసినట్టుగా కోవింద్ చెప్పారు.

స్వచ్ఛ భారత్ తరహలోనే జలసంరక్షణను చేపట్టనున్నామన్నారు. నదులు, కాల్వలపై ఆక్రమణల కారణంగా జల వనరులు తగ్గుతున్నాయని రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు.

2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ముందుకు సాగుతున్నట్టుగా రాష్ట్రతి ప్రకటించారు.ఆక్వా కల్చర్ ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.దీని కోసం బ్లూ రివల్యూషన్ తీసుకొస్తామని రాష్ట్రపతి ప్రకటించారు.

జన్‌ధన్ యోజన్ ద్దవారా బ్యాంకింగ్ సేవలను ప్రతి  ఇంటికి చేర్చినట్టుగా ఆయన తెలిపారు.పేదలకు మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా ఆయన తెలిపారు. 

ఖేలో ఇండియాలో భాగంగా క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నట్టుగా రాష్ట్రపతి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో  రెండు కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు రాష్ట్రపతి చెప్పారు.

మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్రపతి చెప్పారు.దేశంలో బ్రూణ హత్యలు గణనీయంగా తగ్గాయని కోవింద్ గుర్తు చేశారు

వెనుకబడిన జిల్లాల అభివృద్దిపై  కేంద్రీకరించినట్టుగా రాష్ట్రపతి చెప్పారు. అటల్ జీ ఇన్నేవేషన్ స్కీం కింద సుమారు 9 వేల స్కూళ్లలో ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని రాష్ట్రపతి చెప్పారు. నగదు బదిలీ పథకం మంచి ఫలితాలను అందిస్తోందని   రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇండియా ఒకటని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.ట్రిపుల్ తలాఖ్‌ను అరికట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి కోవింద్ చెప్పారు

గంగానదిని శుద్ది చేసే కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. గంగా నదితో పాటు ఇతర నదులను కూడ శుద్ది చేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. వాయు కాలుష్య నివారణకు కూడ చర్యలు చేపడుతున్నామని రాష్ట్రపతి ప్రకటించారు.

చంద్రయాన్-2 కు భారత్ సిద్దంగా ఉందని రాష్ట్రపతి తెలిపారు. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు సిద్దమౌతున్నామన్నారు. జీ -20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నట్టుగా ఆయన తెలిపారు. దేశ రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులతో భారత్ సత్తాను ప్రపంచ దేశాలను చాటిన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు.