న్యూఢిల్లీ: 2014లో యూపీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటు జరిగింది. దానిపై సభలో అసలు చర్చ జరిగిందా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు.తెలంగాణ  ఏర్పాటు సమయంలో  పార్లమెంట్‌ను బంద్ చేసి చర్చకు కత్తెరవేశారని ఆయన విమర్శలు గుప్పించారు. ఇప్పుడేమో ఆర్టికల్ 370 మీద  ఇంత రచ్చ చేస్తున్నారని మోడీ గుర్తు చేశారు. 

గురువారం నాడు  పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి మోడీ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా విపక్షాలపై మోడీ ఘాటుగా కౌంటరిచ్చారు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ సాగుతున్న అల్లర్లు అరాచకానికి చిహ్నమని ప్రధాని నరేంద్ర మోదీ నిశితంగా విమర్శించారు. 

పార్లమెంటు, అసెంబ్లీల్లో తీసుకునే నిర్ణయాలపై రోడ్లెక్కి రోజుల తరబడి నిరసన ప్రదర్శనలు చేయడం అరాచకమేనని మోడీ చెప్పారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలు చేసే ఓ చట్టాన్ని ప్రజలు నిరసించి ఆందోళనలకు దిగితే ఏం జరుగుతుందో ఊహించారా అని  ప్రధాని ప్రశ్నించారు. 

దేశాన్ని ఇలానేనా నడిపేది? దీని వల్ల మాకే కాదు, మీకూ (విపక్షానికీ) ఇబ్బందే. దేశం గురించి అంతా పట్టించుకోవాలి. అందుకే మనల్ని ఇక్కడకు పంపారు. దేశంలోని మెజారిటీ ఎంపీలు ఆమోదించిన చట్టమిది. దాన్ని ఉపసంహరించాలా?  ఇది ఆందోళనకరమని ప్రధాని అభిప్రాయపడ్డారు. 

షాహీన్‌బాగ్‌లో రోజుల తరబడి సాగుతున్న నిరసన హోరును పరోక్షంగా  ఆయన ప్రస్తావించారు. సీఏఏను  ఆయన గట్టిగా సమర్ధించుకొన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినవారు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ముస్లింల్లో లేనిపోని భ్రమలు, భయాలు కల్పించి ఈ ఆందోళనలు రెచ్చగొడుతున్నారన్నారని ఆయన విమర్శించారు.

1950లో అప్పటి ప్రధాని పండిట్ నెహ్రు అసోం తొలి ముఖ్య మంత్రి గోపినాథ్ బార్దోలాయ్‌కు లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పాకిస్థాన్‌ నుంచి వచ్చిన హిందువులను శరణార్థులుగా, ముస్లింలను వలసవాదులుగా చూడాలని ఇద్దరి మద్య తేడా ఉండాలని కోరినట్టుగా ఆ లేఖలో ఉందన్నారు. అవసరమైతే చట్టాలు కూడ సవరించాలని కూడ ఆ లేఖలో కోరినట్టుగా  ప్రధాని ఈ సందర్భంగా ఆ లేఖలోని అంశాలను ప్రస్తావించారు.

 నెహ్రూ ను మతవాది అనగలమా ఆయన హిందూ రాష్ట్రాన్ని కోరుకున్నారా? కాంగ్రెస్‌ దీనికి బదులివ్వాలి అని మోదీ కాంగ్రెస్ ను నిలదీశారు. ఆర్టికల్‌ 370 నిర్వీర్యంపై అసలు చర్చే జరగలేదని గులాంనబీ ఆజాద్‌ అన్నారు. 

నేను అడుగుతున్నా ఆనాడు ఏపీ విభజనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగినపుడు ఆ నిరసనను నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తప్పుపట్టారు. నేడు అవే నిరసనలను ఆయన పార్టీ సమర్థిస్తోందని ప్రధాని దుమ్మెత్తిపోశారు.

జాతీయ పౌర పట్టిక(ఎన్‌పీఆర్‌)ను కూడా ప్రధాని గట్టిగా సమర్థించుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సరైన లబ్ధిదారులకు చేరవేయడానికి ఎన్‌పీఆర్‌ అప్‌డేషన్‌ ప్రక్రియ అత్యవసరమని మోడీ చెప్పారు. 

2010లో యూపీఏ హయాంలో తొలిసారి జరిగిందని, 2015లో అప్‌డేషన్‌ జరిగిందన్నారు. ఆనాడు వివాదాస్పదం కానివి నేడెలా అవుతాయని ఆయన ప్రశ్నించారు. ‘ఎన్‌పీఆర్‌లో అడిగే ప్రశ్నలన్నీ పాలనాపరమైన అవసరాల కోసమే. వీటిని వ్యతిరేకించేవారు పేదల అభ్యున్నతికి వ్యతిరేకులని విమర్శించారు.

ఈ మధ్య రాహుల్‌గాంధీ ఓ మాట అన్నారు. వచ్చే ఆరునెలలు ఆగండి.. ప్రధాని తన ఇంటి నుంచి బయటకు కూడా రాలేరు. ఉద్యోగాలు కల్పించనందుకు ఈ దేశ యువత ఆయనను కర్రలతో కొడతారన్నారు. వచ్చే ఆరునెలలూ నా సూర్యనమస్కారాల సంఖ్య పెంచుకుంటా. ఎక్కువగా సూర్యనమస్కారాలు చేస్తే వెన్ను గట్టిపడుతుంది.  దెబ్బలకు సిద్ధంగా ఉంటాను అని  మోడీ చమత్కరించారు.