వయసులో తనకన్నా చిన్నవాడిని పెళ్లి చేసుకున్న యువతిని.. ఆమె తల్లిదండ్రులు అందరిముందూ చితకబాదారు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. సదరు యువకుడు.. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడన్న విషయం ఆలస్యంగా తెలుసుకొని నిర్ఘాంతపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతి(23) ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు కొంతకాలం క్రితం బెంగళూరుకి చెందిన ఓ యువకుడు(20) ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. ఫోన్లో తరచూ మాట్లాడుకునేవారు. పరిచయం కాస్త.. మాటలతో ప్రేమగా మారింది. 

యువకుడు తన వయసు, వృత్తితో పాటు అన్ని విషయాలను దాచిపెట్టాడు. బెంగళూరుకు వస్తే పెళ్లి చేసుకుంటానని, నిన్ను రాణీలా చూసుకుంటానని యువతినినమ్మించాడు. యువతి ఢిల్లీ మీదుగా రైలు ఎక్కి బెంగళూరులో వాలిపోయింది. ఇద్దరూ కలిసి ఓ గుడిలో పూలదండలు మార్చుకుని పెళ్లి తంతు ముగించారు. 

ఇంట్లో పెళ్లి సంగతి తెలిస్తే ఒప్పుకోరని చెప్పి యువతిని ఒక హాస్టల్లో నెలరోజుల పాటు ఉంచాడు. యువకుడు ఇటీవలే భార్యను తీసుకెని ఇంటికెళ్లగా వారు భగ్గుమని ఇద్దరినీ ఇంటి నుంచి బయటికి గెంటేశారు. అంతేగాక ఉత్తరప్రదేశ్‌ నుంచి యువతి తల్లిదండ్రులను నగరానికి రప్పించి మీ కుమార్తెను తీసుకెళ్లాలని సూచించారు. నగరానికి వచ్చిన యువతి తల్లిదండ్రులు ఆమెను సొంతూరికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. 

కానీ భర్తతోనే ఉంటానని పట్టుబట్టిన కుమార్తెను ఆమె తల్లిదండ్రులు రైల్వేస్టేషన్‌లోనే చితకబాదారు. కాగా అది చూసిన రైల్వేపోలీసులు వనితా సహాయవాణి కి సమాచారం అందించారు. వనితా సహాయవాణి సిబ్బంది యువతిని రక్షించి కార్యాలయానికి తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ నిర్వహించగా మోసపోయిన విషయం వెలుగులోకి వచ్చింది.

 సహాయవాణి సిబ్బంది యువకుడిని కార్యాలయానికి పిలిపించి విచారించగా తనకు ఇంకా 20 ఏళ్లు అని, ఉద్యోగం వచ్చాక సంసారం కొనసాగిస్తానని చెప్పాడు. తాను బెంగళూరులోనే ఉండి ఏదైనా ఉద్యోగం చేస్తానని యువతి పట్టుబట్టడంతో ఆశ్రయ కేంద్రంలోనే ఉంచామని సహాయవాణి కౌన్సిలర్‌ సంధ్యారాణి తెలిపారు.