యూట్యూబ్ రాకతో ఈ మధ్య జనంలో విపరీత లక్షణాలు ఎక్కువవుతున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు బాంబులు, తుపాకులు ఎలా తయారు చేయాలో తెలుసుకోవడంతో పాటు మొన్నామధ్య నెలలు నిండిన భార్యకు ఓ భర్త యూట్యూబ్‌లో చూసి పురుడు పోయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

తాజాగా వ్యాధితో బాధపడుతున్న తమ బిడ్డకు తామే వైద్యం చేసుకుంటామని తల్లిదండ్రులు డాక్టర్లతో వాదనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఇద్దరు తల్లిదండ్రులు హడావిడిగా ఆసుపత్రికి వచ్చి నర్స్.. నర్స్ అని అరవడం మొదలుపెట్టారు.

‘‘మాకు డాక్టర్‌తో పని లేదు.. నర్స్ ఉంటే చాలు.. మా అబ్బాయికి మేమే ఆపరేషన్ చేసుకుంటాం.. యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాం. ఏం ఫర్వాలేదు.. కాకపోతే ఓ నర్సును అసిస్టెంట్‌గా ఇవ్వండి అంటూ హంగామా సృష్టించారు.

అక్కడితో ఆగకుండా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలిసి డాక్టర్లు అక్కడికి రావడంతో... ‘‘ మీరు ఉన్న దానికి, లేని దానికి డబ్బులు తీసుకుంటారు. అంత ఖర్చు మేం భరించలేము.. ఇంటర్నెట్‌లో చూశాం... మాకు మేమే చేసుకుంటాం.. ఒక నర్సును ఇవ్వండి చాలు’’ అని డాక్టర్లతో వాదించడం మొదలుపెట్టారు.

ఈ విషయాన్ని వైద్యులు మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోజుల్లో ఇలాంటి పోకడలు ఎక్కువయ్యాయని తామే సొంతంగా ఆపరేషన్లు చేసుకుంటామనే స్థాయికి జనం వెళ్లారంటే..పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్ధమవుతోందని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

యూట్యూబ్ చూసి ఏమైనా లక్షణాలు కనిపించగానే హాస్పిటల్‌‌కు వచ్చి క్యాన్సర్ అంటూ గోల చేస్తున్నారని చెప్పారు. ఎంతో అనుభవం ఉంటే కానీ లక్షణాలను బట్టి వ్యాధిని నిర్థారించలేరని చెప్పారు.