Asianet News TeluguAsianet News Telugu

పండోరా పేపర్లు: పన్నుఎగవేతదారుల జాబితా లీక్.. సచిన్ సహా 380 మంది పేర్లు బయటికి

పనామా, పారడైజ్‌ల తర్వాత ఇప్పుడు పండోరా పేపర్లు అంతర్జాతీయంగా పన్ను ఎగవేతదారులను బయటపెట్టి సంచలనానికి తెరతీశాయి. ఇందులో పలుదేశాధినేతలు, వ్యాపారదిగ్గజాలు, సంపన్నులున్నారు. 380 మంది భారతీయులున్నారు. ఇందులో సచిన్ టెండూల్కర్, అనిల్ అంబానీ సహా పలువురి పేర్లు వెలికి వచ్చాయి.
 

pandora papers says sachin tendulkar in tax evasion leaked list
Author
New Delhi, First Published Oct 4, 2021, 10:24 AM IST

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పన్ను గోల్‌మాల్ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. అత్యధిక సంపన్నులు, బడా వ్యాపారవేత్తలు పన్ను తప్పించుకోవడానికి అక్రమార్గాలు తొక్కుతున్నారు. తక్కువ పన్ను ఉన్న దేశాలు లేదా పన్నులపై కఠిన చట్టాల్లేని, పారదర్శకత లేని దేశాల్లోకి సంపదను తరలించి గుట్టుగా దాచిపెడుతున్నారు. ఇప్పటికే పనామా, ప్యారడైజ్ పేపర్లు ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల పేర్లను బయటికి తెచ్చి నివ్వెరపరిచాయి. ఈసారి అంతకన్నా తీవ్రమైన విషయాలను ఈ పండోరా పేపర్లు బయటపెట్టాయి. పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలుగా కనిపిస్తున్న బెలీజ్, పనామా, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్విట్జర్లాండ్‌లకు సంపద తరలించి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. పనామా పేపర్లు ఇలాంటి దేశాల్లోనే వ్యక్తులు షెల్ కంపెనీలు పెట్టిన విషయాన్ని వెల్లడించి పన్ను ఎగవేసిన ఉదంతాలను వెల్లడించగా, పారడైజ్ పేపర్లు వ్యక్తులు కాకుండా సంస్థల రూపంలో నెరపిన ఈ అక్రమాలను వెల్లడించాయి. తాజాగా పండోరా పేపర్లు ట్రస్టులను ఈ అడ్డదారులకు వినియోగించుకున్నట్టు తెలిపాయి.

ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు(ICIJ) ఆధ్వర్యంలో వాషింగ్టన్ పోస్టు, బీబీసీ, ది గార్డియన్ మొదలు పలు ప్రసిద్ధ మీడియా సంస్థలకు చెందిన సుమారు 600 మంది జర్నలిస్తులు కృషి సల్పి ఈ విషయాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 14 ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల నుంచి లీక్ అయిన సుమారు 1.19 కోట్ల డాక్యుమెంట్లపై పరిశీలనలు చేసి ఈ పండోరా పేపర్లు విడుదల చేశారు.

ఇందులో భారత్ నుంచి 380 మంది పేర్లు ఉన్నాయి. ఇందులో పారిశ్రామికవేత్తలు, ప్రముఖులున్నారు. ఈ పండోరా పేపర్లలో సచిన్ టెండూల్కర్, అనిల్ అంబానీ, నీరవ్ మోడీ సోదరి పేర్లూ వచ్చాయి. వీరితోపాటు బయోకాన్ వ్యవస్థాపకులు కిరణ్ మజుందార్ షా భర్త, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌లపేర్లూ వెలికి వచ్చాయి.

ఇందులో ఇప్పటికీ అధికారంలో ఉన్న ప్రముఖ నేతలు, మాజీ నేతలు ఉన్నారు. కనీసం 35 మంది ఇలాంటి వారున్నారు. ఉదాహరణకు చెక్ రిపబ్లిక్ ప్రధాని ఆంద్రెస్ బబీస్, కింగ్ అబ్దుల్లా, అజర్‌బైజాన్ ప్రెసిడెంట్ ఇలమ్ అలియెవ్, కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్ సభ్యుల పేర్లూ ఈ పేపర్లలో బహిర్గతమయ్యాయి.

లీక్ అయిన 14 గ్లోబల్ కార్పరేట్ సర్వీసెస్ సంస్థలు విదేశాల్లో కనీసం 29వేల డొల్ల కంపెనీలు, ప్రైవేటు ట్రస్టులను ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ కంపెనీలు ఏర్పాటు చేసిన ట్రస్టుల్లో కొన్ని జెన్యూన్‌వీ ఉండవచ్చు. కానీ, ఆ పేపర్ల పరిశీలనలో కీలకంగా రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. కొందరు ప్రముఖులు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు ఇందులో తమ సంపదను దాచుకుని పన్ను అధికారుల తమను చేరుకోలేని విధంగా చేసుకోవడానికి ప్రయత్నించారు. అంటే తమ ఐడెంటీని దాచిపెట్టి సొమ్మును భద్రపరుచుకున్నారు. అలాగే, పెట్టుబడులనూ భద్రంగా ఉంచుకోవడానికి, అంటే వారి పెట్టుబడులపై కనీసం కన్ను పడనీయకుండా చూసుకోవడం. ఇవే ప్రాధాన్యతగా ఈ అక్రమార్గాలు తొక్కినట్టు పండోరా పత్రాలు వెల్లడిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios