ఆధార్‌ నెంబర్‌తో పాన్‌కార్డ్‌ను లింక్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారా.. లింక్ చేయకపోతే ఖంగారుపడకండి. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇలాంటి వారి కోసం గుడ్ న్యూస్ చెప్పింది.

ఆధార్‌ కార్డుతో పాన్‌ కార్డు అనుసంధానం చేసే గడువును 2021 జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

వాస్తవానికి ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానం చేసే గడువు ఈరోజు (మార్చి 31) తో ముగియనుంది. ఆలోగా లింక్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఆలస్య రుసుము చెల్లించాలని పేర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చివరి తేదీని ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. మరోవైపు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ మధ్యాహ్నం 12.30 గంటలకు రష్ పెరగడంతో క్రాష్ అయింది.

అప్పటి నుంచి పాన్ - ఆధార్ లింక్ పేజీ పనిచేయడం లేదు, దీనితో ప్రజలు నిరాశకు గురయ్యారు. చాలా మంది ప్రజలు వారి కోపాన్ని, ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.