Palestine India Envoy Mukul Arya: పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్‌ ఆర్య మృతి చెందారు. ముకుల్ మరణంపై విదేశాంగ శాఖతో పాటు పాలస్తీనా ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన భౌతికకాయాన్ని భారత్​కు తరలించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. 

Palestine India Envoy Mukul Arya: పాలస్తినాలో భారత రాయబారి ముకుల్‌ ఆర్య(38) హఠాన్మరణం చెందారు. ముకుల్‌ ఆర్య మృతిని ధ్రువీకరిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పాలస్తినాలోని భారత ప్రతినిధి ముకుల్ ఆర్య మరణించిన విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాన‌ని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. ముకుల్‌ ఆర్య ప్రతిభావంతుడైన అధికారి అని.. ఆయ‌న కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు జైశంకర్ తెలిపారు. అయితే ముకుల్ మృతికి సంబంధించిన విషయాలేవీ ప్రస్తుతం తెలియరాలేదు.

అలాగే.. విదేశాంగ వ్యవహారాలు, వలసదారుల మంత్రి డాక్టర్ రియాద్ అల్-మాలి.. విచారం వ్య‌క్తం చేశారు. స్నేహపూర్వక భారత ప్రభుత్వానికి, ప్రతినిధి ఆర్య కుటుంబానికి , అతని బంధువులకు తన హృదయపూర్వక సంతాపాన్ని, హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నారు. పాలస్తీనా రాష్ట్రంలోని భారత ప్రతినిధి ముకుల్ ఆర్య మృతి పట్ల పాలస్తీనా అగ్ర నాయకత్వం ఆదివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ముకుల్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం భారతదేశానికి తరలించే ఏర్పాట్లను పూర్తి చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అధికారిక సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు ముకుల్ మృతి పట్ల పాలస్తీనా ప్రభుత్వం విచారణ వ్యక్తం చేసింది. ఆయన మరణంపై దర్యాప్తు జరిపాలని అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాన మంత్రి డాక్టర్ ముహమ్మద్ ష్టయ్య్ అన్ని విభాగాలను ఆదేశించారు. 

2008 ఇండియన్ ఫారిన్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన ముకుల్.. అంతకముందు కాబూల్, మాస్కోలోని రాయబార కార్యాలయాలతో పాటు దిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేశారు. పారిస్‌లోని యునెస్కోకు భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందంలోనూ ముకుల్ సేవలందించారు. ఆర్య పుట్టి పెరిగింది ఢిల్లీలోనే.. 2008లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరడానికి ముందు ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎకనామిక్స్ చదివాడు.