పంజాబ్ లోని గురుదాస్‌పూర్ సెక్టార్‌లో రాత్రి రెండుసార్లు డ్రోన్ కదలికలు కనిపించాయి. ఆదివారం రాత్రి గురుదాస్‌పూర్‌లోని చందు వాడాల అవుట్‌పోస్టు వద్ద డ్రోన్ శబ్దం వినిపించింది. దీంతో అప్రమత్తమైన జవాన్లు 26 రౌండ్లు కాల్పులు జరిపారు.
పంజాబ్‌లోని బీఎస్‌ఎఫ్ సెక్టార్ గురుదాస్‌పూర్‌లో పాకిస్థాన్ డ్రోన్‌ల చొరబాట్లు కొనసాగుతున్నాయి. పొగమంచును అవకాశంగా తీసుకుని పాక్ స్మగ్లర్లు హెరాయిన్, ఆయుధాల సరుకులను భారత సరిహద్దుకు తరలించేందుకు వికృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి డ్రోన్ కలకలం చెలారేగింది. రెండుసార్లు డ్రోన్ చొరబాట్లకు ప్రయత్నించినట్టు గుర్తించిన అధికారులు వాటిపై కాల్పులు జరిపి.. వెనక్కి పంపించేశారు. దాదాపు 100 రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత సరిహద్దు భద్రతా దళం సిబ్బంది డ్రోన్‌ను వెనక్కి పంపారు.
సమాచారం ప్రకారం.. గురుదాస్‌పూర్ సెక్టార్‌లో రాత్రి రెండుసార్లు డ్రోన్ చొరబాట్లు జరిగాయి. పంజాబ్‌లోని చందు వడాల గ్రామంలోని కస్సోవాల్ పోస్ట్‌లో ఆదివారం రాత్రి 10:20 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ డ్రోన్‌లు కనిపించాయి. డ్రోన్‌ను గమనించిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సిబ్బంది వాటిని మరింత ముందుకు రానీయకుండా కాల్పులు జరిపారు. ఈ క్రమంలో భద్రతా దళాలు 26 రౌండ్లు కాల్పులు జరిపారు. డ్రోన్ యొక్క సరైన కదలికను చూడటానికి 6 తేలికపాటి బాంబులను కూడా కాల్చారు. ఆ తర్వాత డ్రోన్ తిరిగి వెనక్కి వెళ్లింది.
ఈ ఘటన జరిగిన కొన్ని నిమిషాల తర్వాత.. 10:48 గంటల ప్రాంతంలో BOP కస్సోవాల్‌లో డ్రోన్ శబ్దం వినిపించింది. దీంతో అప్రమత్తమైన సైనికులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా 4 లైట్ బాంబ్ స్టెయిన్డ్ తో పాటు 72 రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ సంఘటన జరిగినప్పటి నుండి బీఎస్ఎఫ్(BSF), స్థానిక పోలీసులు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని గురుదాస్‌పూర్ బీఎస్‌ఎఫ్ డీఐజీ ప్రభాకర్ జోషి చెప్పారు.
అంతకుముందు ఆదివారం ఉదయం పంజాబ్‌లోని చందు వడాలాలో డ్రోన్ ఎగురుతున్నట్టు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు దానిపై 40 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో అది పాకిస్థాన్ వైపు తిరిగి వెళ్లిపోయింది. ఆ డ్రోన్ దాదాపు 15 సెకన్ల పాటు భారత భూభాగంలోనే ఉన్నట్టు అధికారులు తెలిపారు.
డ్రోన్స్ ద్వారా హెరాయిన్ సరఫరా
పంజాబ్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో డిసెంబర్ 15న డ్రోన్‌ల ద్వారా అక్రమంగా తరలించిన దాదాపు ఏడు కిలోల హెరాయిన్‌ను బీఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ తొలుత అమృత్‌సర్ జిల్లాలోని డాక్ గ్రామం సమీపంలో ప్రవేశించిందని అధికారులు తెలిపారు. దీనిని గుర్తించిన BSF సిబ్బంది దానిపై కాల్పులు జరిపారు. అనంతరం ఆ ప్రాంతంలో జరిపిన శోధనలో 4.49 కిలోల బరువున్న హెరాయిన్ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కేవలం రెండు గంటల తర్వాత ఫాజిల్కా జిల్లాలోని బరికే గ్రామం సమీపంలో భారత్‌లోకి ప్రవేశించిన మరో డ్రోన్‌ను BSF దళాలు గుర్తించి కాల్పులు జరిపాయి. అనంతరం బీఎస్ఎఫ్ సిబ్బంది 2.650 కిలోల బరువున్న మత్తుమందు ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
