పాకిస్తాన్‌ను ఉద్దేశించి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని డిఫెన్స్ కారిడార్‌లో తయారవుతున్న ఫిరంగులు గర్జిస్తే పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుడుతుందన్నారు.  

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుందేల్ ఖండ్ రీజియన్‌లోని బాందాలో ఈ రోజు నిర్వహించిన కలింజార్ మహోత్సవ ప్రారంభోత్సవ వేడుకల్లో యోగి ఆదిత్యనాథ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇక్కడి డిఫెన్స్ కారిడార్‌లో తయారవుతోన్న ఫిరంగులు గర్జిస్తే.. పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుడుతుందన్నారు. ఈ క్రమంలో ప్రపంచ పటం నుంచి పాక్ దానంతట అదే అదృశ్యమవుతుందని యోగి ఆదిత్యనాథ్ జోస్యం చెప్పారు.

ఢిల్లీ, లక్నోలకు ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించామని సీఎం తెలిపారు. తద్వారా చిత్రకూట్ నుంచి ఢిల్లీకి కేవలం ఐదున్నర గంటల్లో ప్రయాణించవచ్చని.. రాబోయే రోజుల్లో చిత్రకూట్‌లో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తామని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. కాగా.. ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ నిమిత్తం ఆగ్రా, అలీగఢ్, చిత్రకూట్, ఝాన్సీ, కాన్పూర్, లక్నోలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. 

ALso REad: రాముడు, కృష్ణుడి ఉనికిపై కాంగ్రెస్, సీపీఎంలకు నమ్మకం లేదు: త్రిపుర ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి ఆదిత్యనాథ్

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలోనూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్‌ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారనీ, అయోధ్యలో కూడా రామ మందిర నిర్మాణానికి ముందు వారే పెద్ద అడ్డంకులు. వారు విశ్వాసాన్ని గౌరవించాలని కోరుకోరు. రాముడు లేదా కృష్ణుడు లేడని వారు పేర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం చివరి దశలో ఉందని చెప్పారు.

ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి ప్రక్రియను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్, సీపీఎం ప్రయత్నిస్తున్నాయని ఆదిత్యనాథ్ ఆరోపించారు. తాను 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు త్రిపురను చూశాననీ, ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి లోపామని చూశాననీ, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వమే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను జాబితా చేస్తూ.. తొలిసారిగా ఎలాంటి రాజకీయాలకు అతీతంగా పౌరులకు ప్రయోజనాలు అందుతున్నాయని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్ల ఇది సాధ్యమైందని ఆయన అన్నారు.