న్యూఢిల్లీ:పాకిస్తాన్ ప్రపంచదేశాల్ని తప్పుదోవ పట్టిస్తోందని భారత విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్  ఆరోపించారు.

శుక్రవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తూ తీసుకొన్న నిర్ణయం తర్వాత పాక్ తీసుకొన్న  చర్యలను ఆయన తప్పు బట్టారు.పాకిస్తాన్ చర్యలను రవీష్ కుమార్ తీవ్రంగా ఖండించారు.

జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి పాకిస్తాన్ అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ తమ దేశం నుండి ఇండియాలోకి అక్రమంగా చొరబాట్లను ఇకనైనా ఆపివేయాలని ఆయన కోరారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలును పాకిస్తాన్ నిలిపివేసిందని  ఆయన గుర్తు చేశారు.ఈ రైలుతో పాటు  మరో రైలును కూడ పాకిస్తాన్ నిలిపివేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.

వాస్తవాలను పాకిస్తాన్  అంగీకరించాలని  రవీష్ కుమార్ కోరారు. చైనాలో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్  త్వరలో ఆ దేశంలో పర్యటించనున్నారని రవీష్ కుమార్ ప్రకటించారు.భారత్ కు చైనా  మంచి పార్ట్‌నర్  అని ఆయన గుర్తు చేశారు.

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని  ప్రపంచదేశాలను తప్పుదారి పట్టించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. ఈ ప్రచారం పాకిస్తాన్ కుట్రగా రవీష్ కుమార్  ప్రకటించారు.