పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గంలోకి నవజోత్ సింగ్ సిద్దూను మళ్లీ చేర్చుకోవాలని పాకిస్తాన్ ప్రధాని విజ్ఞప్తి చేశాడని అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి కూడా తెలియజేశానని వివరించారు. సిద్దూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాను ఆలింగనం చేసుకున్నారని, ఇలాంటి వ్యక్తి చేతిలో రాష్ట్ర భద్రతను పెట్టలేమని అన్నారు. 

చండీగడ్: పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్(Captain Amarinder Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధూ(Navjot singh sidhu)తో వైరం కొనసాగిన సంగతి తెలిసిందే. నవజోత్ సింగ్ సిద్దూ వైరం వల్లే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి పార్టీ వీడినట్టూ చర్చ జరిగింది. అదే సందర్భంలో సిద్దూ ఎక్కడ పోటీ చేసినా.. ఆయన ఓడించడమే తన లక్ష్యమని ఓ సారి ప్రకటించిన సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ అమరీందర్ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నవజోత్ సింగ్ సిద్దూను మళ్లీ తన మంత్రివర్గంలో చేర్చుకోవాలని పాకిస్తాన్ ప్రధాన మంత్రి (Pakistan Prime Minister) ఇమ్రాన్ ఖాన్ తనను కోరినట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని తాను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)కి కూడా తెలియజేశానని వివరించారు.

పటియాలాలోని రామ్‌లీలా మైదాన్‌లో ఓ సభలో కెప్టెన్ అమరీందర్ సింగ్ మంగళవారం మాట్లాడారు. తాను పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవజోత్ సింగ్ సిద్దూను మళ్లీ తన మంత్రివర్గంలో చేర్చుకోవాలని పాకిస్తాన్ ప్రధాని విజ్ఞప్తి చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా తెలియజేశానని వివరించారు. ఇదే సందర్భంలో ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను సిద్దూ ఆలింగనం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. భారతీయులను చంపేయాలని రోజూ తన సైనికులకు ఆదేశాలు ఇచ్చే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాను ఆలింగనం చేసుకోవడం విస్మయానికి గురి చేసిందని వివరించారు. ఇలాంటి వైఖరి ఉన్న వ్యక్తిని నమ్మలేమని, పంజాబ్ రాష్ట్ర, దేశ భద్రతను ఈయన చేతిలో పెట్టలేమని తెలిపారు. సిద్దూ లాంటి వ్యక్తి చేతిలో రాష్ట్ర పాలన పెట్టలేమని, సరిహద్దుకు ఆవల వైపు నుంచి భద్రత లభించదని పేర్కొన్నారు.

పాకిస్తాన్‌తో శాంతియుత బంధాన్నే తాము కోరుతున్నామని అన్నారు. కానీ, అదే సమయంలో ఆ దేశం ముందు మోకరిల్లే ప్రసక్తే లేదని వివరించారు. ఏ ఉపద్రవం వచ్చినా.. వారితో పోరాడటానికి భారత ఆర్మీ సిద్ధంగా ఉన్నదని తెలిపారు. నేరుగా ఆ దేశ ఆర్మీతో ఎదురుబడి పోరాడటానికి సంసిద్ధంగా ఉన్నదని వివరించారు. పంజాబ్ రాష్ట్ర భద్రత, అదే విధంగా దేశ భద్రత కూడా చాలా ముఖ్యమైన అంశం అని తెలిపారు. ఈ భద్రతను పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూటమితోనే సాధ్యమని పేర్కొన్నారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ భద్రత కేంద్రంలో అధికారంలోని బీజేపీతో పీఎల్‌సీ కూటమితో సాధ్యం అవుతుందని తెలిపారు. త్వరలో తమ కూటమి కోసం ప్రచారం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలు పంజాబ్ రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. పంజాబ్ పురోగమించడానికి రాష్ట్రం, కేంద్రం కలిసి పని చేయాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. తాను పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ పీఎం మోడీతో వ్యక్తిగతంగా సత్సంబంధాలే కొనసాగించానని చెప్పారు.