భారత జాలాల్లోకి అక్రమంగా చొరబడ్డ పాకిస్తాన్ మత్సకారుల బోట్ ను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. అయితే ఈ బోటులో అనుమానస్పదంగా ఎలాంటి వస్తువులు లభించలేదు. అయితే చొరబాటుదారులను పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
ఇండో- పాక్ సరిహద్దుకు సమీపంలో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో అరేబియా సముద్రం సమీపంలోని హరామి నాలా క్రీక్ ప్రాంతం నుండి పాకిస్తాన్ ఫిషింగ్ బోట్‌ను స్వాధీనం చేసుకున్నామని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సోమవారం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇండో పాక్ సరిహద్దులోని హరామి నాలా ప్రాంతంలో సరిహద్దు పిల్లర్ నంబర్ 1160 సమీపంలో భారత భూభాగంలో సుమారు 100 మీటర్ల దూరంలో ఈ ఫిషింగ్ బోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ ఆదివారం రాత్రి జరిగిందని, అయితే ఆ సమయంలో కొంతమంది మత్స్యకారులు మరో పడవతో పాకిస్తాన్ భూభాగంలోకి పారిపోయారు.
ఈ పడవలో కొన్ని చేపలు, చేపలు పట్టే వలలు, ఇతర ఫిషింగ్ పరికరాలు బయటపడ్డాయని, ఇవి తప్ప అనుమానస్పదంగా మరేమీ బయటపడలేదని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ సమయంలో ఆ ప్రాంతంలో ముమ్మరంగా అన్వేషణ కొనసాగుతోందని బీఎస్ఎఫ్ తెలిపింది. ఆదివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో సరిహద్దు పిల్లర్ నంబర్ 1164 దగ్గర రెండు పాకిస్తానీ ఫిషింగ్ బోట్ల కదలికను పెట్రోలింగ్ చేస్తున్న BSF బృందం గమనించింది. హరామి నాలా ప్రాంతంలో సరిహద్దు స్తంభం నంబర్ 1160 సమీపంలో 4-5 మంది పాకిస్తానీ మత్స్యకారులను కూడా ఈ బృందం గుర్తించింది.
‘‘ బీఎస్ఎఫ్ గస్తీ బృందం కాలినడకన చిత్తడి నేలలు, నాలాలను దాటి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. పాకిస్తాన్ మత్స్యకారులు బీఎస్‌ఎఫ్ గస్తీ బృందం తమ వైపునకు రావడం చూసి, చిత్తడి నేలను ఉపయోగించుకొని పాకిస్తాన్ భూభాగంలోకి పారిపోయారు’’ అని అధికారులు తెలిపారు. అయితే బోట్ అక్కడే ఉండటం వల్ల దానిని స్వాధీనం చేసుకుంది.
హరామి నాలా క్రీక్ ప్రాంతం ప్రాంతంలో తరచుగా పాక్ కు చెందిన మత్స్యకారులు పట్టుబడుతున్నారు. ఫిబ్రవరి 9వ తేదీన ఇదే రాష్ట్రంలోని హరామి నల్లాలో 11 పాకిస్థానీ ఫిషింగ్ బోట్లను సీజ్ చేసింది. దీంతో పాటు ఆరుగురి మత్స్యకారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన క్రీక్ ప్రాంతంలోనే భారత భూభాగంలోకి అక్రమ చొరబాటుకు ప్రయత్నించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని, మూడు ఫిషింగ్ బోట్‌లను బీఎస్ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ బోట్లలో పలువురు పాక్ కు చెందిన వ్యక్తులు ఉన్నప్పటికీ బీఎస్ఎఫ్ బలగాలను చూసి తప్పించుకుని పారిపోయారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఒక్య వ్యక్తి మాత్రమే వారికి చిక్కారు. ఆ మూడు బోట్లలోనూ బీఎస్ఎఫ్ సోదాలు నిర్వహించగా అందులో అనుమానస్పదంగా ఏమీ కనిపించలేదు.
ఇదిలా ఉండగా.. ఆదివారం డెఫ్ట్ ద్వీపం సమీపంలో చేపలు పడుతున్న 12 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్టు చేసింది. ఒక పడవను స్వాధీనం చేసుకున్నారు. పీటీఐ వెల్లడించిన వివరాల ప్రకారం తమిళనాడులోని రామేశ్వరం నుంచి మత్స్యకారులు డెల్ఫ్ట్ ద్వీపం సమీపంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో శ్రీలంక నావికాదళం పెట్రోలింగ్‌కు వచ్చి వారిని అరెస్టు చేసింది. గతంలో కూడా ఇలా మత్స్యకారులను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుంది.
