దేశంలో సుపరిపాలన అందజేస్తోన్న రాష్ట్రాల జాబితాలో కేరళ తొలి స్థానంలో నిలిచింది. పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్-2020 పేరుతో బెంగళూరుకు చెందిన పబ్లిక్ అఫైర్స్ సెంటర్ (పీఏసీ) ఈ జాబితాను శనివారం విడుదల చేసింది.

పెద్ద రాష్ట్రాల జాబితాలో కేరళ తొలిస్థానంలోనూ.. ఉత్తర్‌ప్రదేశ్ చిట్టచివరన నిలిచాయి. పబ్లిక్ అఫైర్స్ సెంటర్‌ ఛైర్మన్‌గా ఇస్రో మాజీ ఛైర్మన్ కే కస్తూరీరంగన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సుస్థిరమైన అభివృద్ధి సూచిక ఆధారంగా పాలన, పనితీరుపై రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయించినట్టు పీఏసీ తెలిపింది. ఈ జాబితాలో దక్షిణాదిలో నాలుగు రాష్ట్రాలుతొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి.

మొత్తం 1.388 పాయింట్లతో కేరళ మొదటి స్థానంలో నిలవగా తర్వాత తమిళనాడు (0.912), ఆంధ్రప్రదేశ్ (0.531), కర్ణాటక (0.468) నిలిచాయి. తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. అయితే, అభివృద్ధి చెందుతున్న మొత్తం 18 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉండటం ఊరటనిచ్చే అంశం. సమన్యాయంలో మాత్రం మైనస్ మార్కులు సాధించింది.

ఇక, పెద్ద రాష్ట్రాలైన యూపీ, ఒడిశా, బిహార్‌లో అట్టడుగున ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో నెగెటివ్ పాయింట్లు రావడం గమనార్హం. యూపీ (-1.461), ఒడిశా (-1.201), బిహార్ (-1.158) మైనస్‌ పాయింట్లు దక్కించుకున్నాయి. చిన్న రాష్ట్రాల ర్యాంకింగ్స్‌లో గోవా (1.745) తొలి స్థానంలో నిలవగా తర్వాతి మేఘాలయ (0.797), హిమాచల్‌ ప్రదేవ్ (0.725) ఉన్నాయి.

ఈ జాబితాలో అత్యంత చెత్త ప్రదర్శనతో నెగెటివ్ స్కోర్ సాధించిన మణిపుర్ (-0.363), ఢిల్లీ (-0.289), ఉత్తరాఖండ్ (0.277) కింద వరసులో నిలిచాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ 1.05 పాయింట్లతో మొదటి స్థానం సాధించింది. తర్వాత పుదుచ్చేరి (0.52), లక్షద్వీప్ (0.003) ఉండగా, కింది వరసులో దాద్రా నగర్ హవేలీ (-0.69), అండమాన్, జమ్మూ కశ్మీర్ (0.50), నికోబార్ (0.30) కొనసాగుతున్నాయి.