UP election result 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టిస్తూ ఘన విజయం సాధించి.. మళ్లీ అధికారం చేపట్టబోతున్నది. "బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎంఐఎం అధినేత ఓవైసీ, బీఎస్పీ అధినేత్రి మాయావతిలకు పద్మ భూషణ్, భారతరత్న ఇవ్వాలంటూ" శివసేన నాయకుడు సంజయ్ రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
UP election result 2022: ఇటీవల ఏడు దశల్లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 403 స్థానాలకు బీజేపీ 273 స్థానాలను కైవసం చేసుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే కొన్ని సీట్లను బీజేపీ కోల్పోయింది. 59 స్థానాలను బీజేపీ నిలబెట్టుకోలేక పోయింది. భారీ ఆశాలు పెట్టుకున్న సమాజ్ వాదీ పార్టీ అంచనాలను అందుకోలేదు. కేవలం 125 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్, బీఎస్పీలు దారుణంగా విఫలమయ్యాయి. కాంగ్రెస్ 2, బీఎస్పీ 1 స్థానానికి మాత్రమే పరిమితం అయ్యాయి. ఇతరులు రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు.
ప్రస్తుతం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించినప్పటికీ.. బీజేపీ విజయానికి ఎంఐఎం, బీఎస్పీలే కారణమంటూ పలు రాజకీయ పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే శివసేన నాయకుడు సంజయ్ రౌత్.. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'బీజేపీ విజయానికి సహకరించినందుకు' ఇద్దరు నేతలకు పద్మవిభూషణ్, భారతరత్న అవార్డులు తప్పక ప్రదానం చేయాలంటూ సంజయ్ రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'బీజేపీ ఘన విజయం సాధించింది. యూపీ వారి రాష్ట్రం. అఖిలేష్ యాదవ్ తన సీట్లను 42 నుండి 125కు పెంచుకుంది. అంటే 42 నుండి 125 కి 3 రెట్లు పెరిగాయి. బీజేపీ గెలుపునకు మాయావతి మరియు ఒవైసీలు సహకరించారు. కాబట్టి వారికి పద్మవిభూషణ్, భారతరత్న ఇవ్వాలి”అని అంటూ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ఇక పంజాబ్‌లో బీజేపీ వంటి జాతీయవాద పార్టీని పూర్తిగా తిరస్కరించడం ఆందోళన కలిగిస్తోందని రౌత్ అన్నారు.
“ప్రధానమంత్రి, హోం మంత్రి, రక్షణ మంత్రి, అందరూ పంజాబ్‌లో విపరీతంగా ప్రచారం చేశారు, అప్పుడు మీరు పంజాబ్‌లో ఎందుకు ఓడిపోయారు? ఇప్పటికే యూపీ, ఉత్తరాఖండ్, గోవా మీదే ఉండేది, బాగానే ఉంది. కానీ, యూపీలో కాంగ్రెస్, శివసేనతో పోలిస్తే పంజాబ్‌లో మీరు ఓడిపోయారు. పంజాబ్‌లో బీజేపీ రెండు స్థానాలను గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ 92 సీట్లకు పెరిగిందని అన్నారు. కాగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీఎస్పీ పాత్రపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బీఎస్పీ చీఫ్ మాయావతి (mayawathi) బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని, ఆ పార్టీ కాషాయ పార్టీకి బీ టీమ్ గా మారిందని విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను మాయవతి ఖండించారు. బీజేపీతో యుద్ధం సూత్రప్రాయంగా జరిగిందని తెలిపారు.
