హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఛాన్సలర్ తన తాజా లేఖలో లాక్ డౌన్ ను మే 3వ తేదీతో ఎత్తివేయకూడదని, మే 24వతేది వరకు పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. 

మే3వ తేదీన గనుక లాక్ డౌన్ ని ఎత్తేస్తే.... అత్యుత్సాహం కలిగిన ముస్లింలు రంజాన్ షాపింగ్ పేరుతో మార్కెట్ల మీద గుంపులుగుంపులుగా ఎగబడి కరోనా వైరస్ భారత దేశంలో తారాస్థాయిలో ఉన్న సమయంలో ప్రమాదంగా పరిణమించగలరని ఫిరోజ్ భక్త్ అహ్మద్ అన్నారు. 

తబ్లీగి జమాత్ ప్రార్థనలకు హాజరయిన అత్యుత్సాహం కలిగిన ముస్లింల వల్ల కలిగిన ప్రమాదం ఏమిటో అందరు చూసారని, ఇప్పుడు గనుక మే3వతేదీన లాక్ డౌన్ ఎత్తేస్తే షాపింగులని, ఇఫ్తార్ పార్టీలని, ప్రార్థనలనీ ఇలా అనేక కారణాలతో అందరూ ఒక్కచోట చేరే ప్రమాదం లేకపోలేదట అని ఆయన అన్నారు. 

క్వారంటైన్లో ఉంటున్న తన మతానికి చెందిన కొందరు, డాక్టర్లు, నర్సులు, పోలీసులు,ఇతర వైద్య, సహాయక సిబ్బంది పై దాడి చేసారని, వారితరుపున చట్టప్రకారంగా నడుచుకునే ఒక భారతీయ ముస్లింగా క్షమాపణలు చెబుతున్నట్టు ఫిరోజ్ భక్త్ అహ్మద్ తన లేఖలో పేర్కొన్నారు. 

పౌరసత్వ సవరణ చట్టం అప్పుడు కూడా ఛాన్సలర్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మనూ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఛాన్సలర్ కి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసారు. ఆయన అప్పట్లో ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని స్వాగతిస్తున్నానని, ప్రజలెవరూ కూడా భారతదేశ విచ్చిన్నకర రాజకీయ శక్తుల చేతుల్లో పడకూడదని ఆయన పిలుపునిచ్చాడు. 

రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపే బదులు ప్రధానికి మద్దతివ్వాల్సిందింగా ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ముస్లింలంతా ఒక చేతిలో ఖురాన్ పట్టుకొని మరో చేతిలో కంప్యూటర్ పట్టుకొని ముందుకెళ్లాలని ఆయన ఎప్పటి నుండో నినదిస్తున్నారు.