మహారాష్ట్రలో ప్రభుత్వ నిర్వహించిన ఓ అవార్డు కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. మండే ఎండల్లో ఆరు గంటలపాటు ప్రజలు కూర్చోవాల్సి వచ్చింది. ఈ ఎండల వేడిమిని తట్టుకోలేక 11 మంది మరణించారు. ఈ సంఖ్య పెరిగే అవకాశముంది. సుమారు 600 మందికిపైగా వడదెబ్బ తగిలింది.
ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వ అవార్డు కార్యక్రమానికి హాజరైన వేలాది మంది మండుటెండల్లో ఆరు గంటలపాటు కూర్చోవాల్సి వచ్చింది. వేలాది మంది తరలివచ్చిన ఈ కార్యక్రమానికి వారంతా నేరుగా ఎండలోనే కూర్చోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే వందలాది మందికి వడదెబ్బ తగిలింది. కనీసం 11 మంది మరణించినట్టు సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదనీ తెలిసింది. రాయ్‌గడ్ జిల్లా కలెక్టర్ యోగేశ్ మాట్లాడుతూ 11 మంది మరణించినట్టు వివరించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం భూషణ్ అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహించింది. నవీ ముంబయిలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరై అవార్డును సోషల్ యాక్టివిస్టు దత్తాత్రేయ నారాయణ్‌కు అందించారు. ఈ సిటీలో ఉష్ణోగ్రత గరిష్టంగా 38 డిగ్రీలుగా నమోదైంది. సీఎం ఏక్‌నాథ్ షిండే, ఆయన డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్‌లూ కార్యక్రమంలో ఉన్నారు.
వేలాది మంది ఈ అవార్డు కార్యక్రమానికి తరలివచ్చారు. కానీ, వారికి తగిన ఏర్పాట్లు లేవని తెలుస్తున్నది. బయటకు వచ్చిన వీడియోల ప్రకారం, వేలాది మంది ఎలాంటి ఆవాసం లేకుండా ఎండల్లో కూర్చుని ఉండగా.. మధ్య మధ్యలో వారు కార్యక్రమాన్ని వీక్షించడానికి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సుమారు వేయి మంది వీఐపీలు, మీడియావారి కోసం రెండే టెంట్లు వేశారు.
Also Read: ముగిసిన కేజ్రీవాల్ సీబీఐ విచారణ.. లిక్కర్ స్కాం కల్పితం, ఆప్‌ను అంతం చేసే కుట్రేనన్న ఢిల్లీ సీఎం
ఎండ కారణంగా డీహైడ్రేషన్‌తో బాధపడ్డారు. మరికొందరు కళ్లు తిరిగి కిందపడిపోయారు. ఇలాంటి ఘటనలతో ఒక తొక్కిసలాంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. వేడి సంబంధిత కారణాలతో ఇక్కడ మరణాలు చోటుచేసుకున్నాయి. 54 ఏళ్ల జయశ్రీ గుండె పోటుతో అక్కడ మరణించింది.
ఓ అధికారి మాట్లాడుతూ, ఇప్పటి వరకు 13 మంది మరణిచారని, ఈ సంఖ్యమరింత పెరిగే అవకాశం ఉన్నదని అన్నారు. సుమారు 600 మందికి వడదెబ్బ తగిలింది.
ఈ ఘటన పై సీఎం ఏక్‌నాథ్ సిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం షిండే హాస్పిటల్ వెళ్లి బాధితులను పరామర్శించారు.
