Asianet News TeluguAsianet News Telugu

హిమాచల్, ఉత్తరాఖండ్ లలో భారీ వర్షాలు: 50 మంది మృతి, భారీగా ఆస్తి నష్టం

భారీ వర్షాలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్  రాష్ట్రాల ప్రజలను తీవ్ర ఇక్కట్ల పాలు చేసింది.  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వర్షాల కారణంగా  50 మంది మృతి చెందారు

Over 50 dead in Himachal rain fury; landslides in Uttarakhand, buildings damaged lns
Author
First Published Aug 14, 2023, 9:24 PM IST

న్యూఢిల్లీ:ఎడతెరిపి లేకుండా  కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో  ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా  హిమాచల్ ప్రదేశ్  రాష్ట్రంలో  50 మంది మృతి చెందారని  సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖ్ చెప్పారు. ఈ రాష్ట్రంలో భారీ వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి.  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి పొరుగునే ఉన్న ఉత్తరాఖండ్ లో కూడ  కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  కొండ చరియలు విరిగిపడుతున్నాయి, వంతెనలు, బ్రిడ్జిలు  కొట్టుకుపోయాయి.  భారీ వర్షాలతో  విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని  సోలన్ జిల్లాలోని  జాదోన్ గ్రామంలో ఆదివారంనాడు రాత్రి భారీ వర్షాలతో  ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారని అధికారులు ప్రకటించారు. వర్షాలతో రెండు ఇళ్లు, పశువుల పాక  వరద నీటిలో కొట్టుకుపోయాయి.   వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని  రక్షించినట్టుగా  సోలన్ డివిజనల్ కమిషన్ మన్మోహన్ శర్మ  తెలిపారు. హర్నం, కమల్ కిషోర్, హేమలత,  రాహుల్,  నేహా, గోలు, రక్ష మృతి చెందినట్టుగా  సోలన్ ఎస్పీ  గౌరవ్ సింగ్  చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో  శివాలయం కూలిపోవడంతో తొమ్మిది మంది మృతి చెందారని  సీఎం తెలిపారు. ఆలయంలో  పూజలు చేసేందుకు  50 మంది వచ్చారు. ఆలయం  కూలిపోయిన శిథిలాల కింద  చిక్కుకున్న వారిని  ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షిస్తున్నారు. సిమ్లాలో ప్రైవేట్ బస్సుపై  చెట్టు విరిగి పడడంతో  బస్సు కండక్టర్ కు గాయాలయ్యాయి.సోలన్ జిల్లాలోని బలేరా  పంచాయితీలో కొండ చరియలు విరిగి పడి తాత్కాలిక ఇల్లు కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

రామ్ షెహెర్ తహసీల్ లోని బనాల్ గ్రామంలో  కొండచరియలు విరిగిపడి ఓ మహిళ మృతి చెందిందని  సోలన్ డీసీ మన్మోహన్ శర్మ తెలిపారు. హమీర్ పూర్  జిల్లాలో  ఎడతెరిపి  లేకుండా కురుస్తున్న వర్షాలతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారని  అధికారులు చెప్పారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని  విద్యా సంస్థలకు ఇవాళ  సెలవును  హిమాచల్ ప్రదేశ్ సర్కార్  ప్రకటించింది. మండిలో  236, సిమ్లాలో  59, బిలాస్ పూర్ జిల్లాలో 40  తో కలుపుకుని రాష్ట్రంలోని 621 రోడ్లపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

సిమ్లా-కల్కా జాతీయ రహదారిపై  పదే పదే కొండ చరియలు విరిగి పడుతున్నాయి. దీంతో సిమ్లా చండీఘడ్ లను కలిపే రోడ్డుపై రాకపోకలకు ఇబ్బందులు నెలకొన్నాయి.రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో  హమీర్ పూర్  జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బియాస్, దాని ఉప నదుల్లో వరద పోటెత్తింది.  

ఈ ఏడాది జూన్  24న  హిమాచల్ ప్రదేశ్ లో  రుతుపవనాలు ప్రవేశించాయి.  రుతు పవనాల ప్రభావంతో  రూ. 7,020  కోట్ల నష్టం వాటిల్లింది. అంతేకాదు  257 మంది మరణించినట్టుగా అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ఈ నెల  14 నుండి 19 వరకు  కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు  కురుస్తాయని  వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని  ప్రాంతాలకు   ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడ  ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.జాతీయ రహదారులతో పాటు  ఇతర రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. తెహ్రిలోని కుంజపురి బగర్దర్  సమీపంలో కొండ చరియలు విరిగిపడడంతో  రిషికేష్-చంబా జాతీయ రహదారిపై  రాకపోకలను  నిలిపివేశారు.   మరో వైపు రిషికేష్- దేవప్రయాగ్- శ్రీనగర్ జాతీయ రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

హరిద్వార్ లో గంగా నది  ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తుంది.  294.90 మీటర్ల  ఎత్తులో ప్రవహిస్తుంది.  చమోలి జిల్లాలో  ఆదివారం నాడు సాయంత్రం నుండి  భారీ వర్షాలు కురుస్తున్నాయి.  దీంతో తరాలి, నందా నగర్ ఘాట్ లలో  భారీ నష్టం వాటిల్లింది.  పిండార్, నందాకిని నదులకు వరద పోటెత్తింది. దీంతో ఈ నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు ఇక్కట్ల పాలౌతున్నారు.అయితే  ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు చెప్పారు. కానీ  భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని  అధికారులు ప్రకటించారు. నంద నగర్ ఘాట్ ప్రాంతంలో మందాకిని నదికి వరద పోటెత్తింది.  దీని దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. 

కోట్‌ద్వార్ లో భారీ వర్షం కారణంగా హో నది, మలన్ సుఖ్రోలు  ప్రమాదకరస్థితిలో  ప్రవహిస్తున్నాయి.  ఈ నదుల ఒడ్డున ఉన్న ఇళ్లు కొట్టుకుపోయాయి.  లోతట్టు ప్రాంతాల ప్రజలను  అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డెహ్రాడూన్, నైనిటాల్  సహా  రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని  రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల కారణంగా  60 మంది మృతి చెందితే, 17 మంది  తప్పిపోయినట్టుగా  ప్రభుత్వం తెలిపింది. 

తెహ్రీ, డెహ్రాడూన్, పౌరీ, చంపావత్, నైనిటాల్,  ఉదం సింగ్ నగర్ జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.హరిద్వార్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్‌డీఆర్ఎఫ్  సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.డెహ్రడూన్  ,చంపావత్  రెండు జిల్లాల్లోని  స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటించారు అధికారులు. భారీ వర్షాల కారణంగా  రెండు రోజుల పాటు చార్‌థామ్ యాత్రను కూడ నిలిపివేశారు అధికారులు.

Follow Us:
Download App:
  • android
  • ios