న్యూఢిల్లీ: గత 24 గంటల్లో ఇండియాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలోనే దేశంలో 52,123 కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 15,83,792కి చేరుకొన్నాయి.

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా 40 వేలకు పైగా కేసులు నమోదౌతున్నాయి. కానీ, 50 వేల మార్కును దాటడం ఇదే మొదటిసారి. 

గత 24 గంటల్లో కరోనాతో 775 మంది మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 34,968కి చేరుకొంది. కరోనా సోకిన వారిలో 10,20,582 మంది కోలుకొన్నారు. కరోనా రోగుల రికవరీ శాతం 64.43 శాతానికి చేరుకొంది.  కరోనా కేసుల పాజిటివ్ శాతం 11.67కి చేరింది.

దేశంలో ఇప్పటివరకు 1,81,90,382 మంది నుండ శాంపిల్స్ సేకరించారు. బుధవారం నాడు ఒక్క రోజే 4,46,642 మంది శాంపిల్స్ సేకరించారు. 

ఇక కరోనాతో మరణిస్తున్న రోగుల జాబితాలో ఇండియా ఐదో స్థానానికి దగ్గరలో ఉంది. 35,100 మరణాలతో ఇటలీ ఐదో స్థానంలో నిలిచింది. ఇండియాలో కరోనాతో ఇప్పటివరకు 34,968 మంది మరణించారు. కరోనా మరణాల్లో అమెరికా, బ్రెజిల్, యూకే, మెక్సికో, ఇటలీ తర్వాతి స్థానాల్లో ఇండియా నిలిచింది.