2001 నుంచి సుమారు 2,000 మంది సైనికుల ఆత్మహత్య.. ‘అమరులుగా పరిగణించబడరు’
ఆర్మీలో ఆత్మహత్యలు ఎక్కువే ఉన్నట్టు తెలుస్తున్నది. ఏడాదికి సగటున 100 నుంచి 140 మంది జవాన్లు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఇలా ఆత్మహత్యలు చేసుకున్నవారిని అమరులుగా పరిగణించబోరని, వారి అంత్యక్రియల్లో ఆర్మీ సెల్యూట్ ఉండదని తెలిపింది.

న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన యువ సైనికుడు అమృత్ పాల్ సింగ్ గత వారం ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్ము కశ్మీర్‌లోని పూంచ్‌లో సెంట్రీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తన ఆయుధంతో గాయపరుచుకున్నాడు. ఆయన మృతదేహాన్ని ఇద్దరు సైనికులు ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో పంజాబ్‌లోని కుటుంబానికి అప్పగించి వెళ్లిపోయారు. ఆ కుటుంబం ఖంగుతిన్నది. అమృత్ పాల్ సింగ్ మరణించాడన్న దు:ఖం ఒకవైపు మరోవైపు ఆర్మీలో ఉండి మరణించినా కనీస గౌరవం దక్కలేదన్న ఉక్రోశం మరోవైపు. అమృత్ పాల్ సింగ్ అంత్యక్రియల్లో ఆర్మీ సెల్యూట్ ఉండదని తెలిసింది. ఆయనను అమరుడిగానూ పరిగణించబోరనే విషయం పంజాబ్ రాజకీయాల్లో దుమారం రేపింది. దీనిపై ఆప్, శిరోమణి అకలీ దళ్ సహా పలు పార్టీలు తీవ్రంగా వ్యాఖ్యలు చేశాయి. దీంతో ఆర్మీ స్పందించి కీలక విషయాలు వెల్లడించింది.
అమృత్‌పాల్ సింగ్ అగ్నివీర్ స్కీమ్ కింద ఆర్మీలోకి వెళ్లాడు. ఈ స్కీం కింద నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందినే ఆర్మీలోకి శాశ్వత ప్రాతిపదికన తీసుకుని మిగిలిన వారిని బయటికి పంపిస్తారనే విషయం తెలిసిందే.
పంజాబ్‌లో రేగిన రాజకీయ దుమారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతో ఆర్మీ ఈ ఘటనపై వస్తున్న అసంతృప్తికి వివరణ ఇచ్చింది. 2001వ సంవత్సరం నుంచి అంటే దాదాపు రెండు దశాబ్దాలుగా ఏడాదికి సరాసరి 100 నుంచి 140 మంది జవానులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆర్మీ అధికారులు వివరించారు. ఆత్మహత్యలు చేసుకున్న జవానులకు మిలిటరీ ఫ్యూనెరల్ వర్తించదని, 1967 ఇండియాన్ ఆర్మీ ఆర్డర్ ఇది ఆదేశిస్తున్నదని తెలిపారు.
Also Read: ఇండియాకు వస్తున్న ఫ్లైట్ పాకిస్తాన్‌కు డైవర్ట్.. ఎందుకు? ఆ తర్వాత ఏం జరిగింది?
సత్యపాల్ మాలిక్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఎక్స్ వేదికగా కామెంట్లు చేశారు. ఇద్దరు సైనికులు ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో అమృత్ పాల్ సింగ్ మృతదేహాన్ని ఇంటి వద్దకు చేర్చి వెళ్లిపోయారని, మిలిటరీ హోదాలో అంత్యక్రియలు ఉండవనీ వారు చెప్పారని వివరించారు. మిలిటరీ సెల్యూట్ గురించి ఆరా తీయగా అది ఆత్మహత్యలు చేసుకున్నవారికి వర్తించదని వివరించారని పేర్కొన్నారు. ‘అప్పుడు గ్రామస్తులు ఎస్ఎస్‌పీతో మాట్లాడారని, పోలీసు బలగాల నుంచి సెల్యూట్ తీసుకున్నారు. వీరికి అమరుల హోదా ఇవ్వనందుకు కేంద్ర ప్రభుత్వం సిగ్గుపడాలి’ అని కటువుగా కామెంట్ చేశారు.