తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 10 శాతం పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ వృథా అయిందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండటంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ 10 శాతం కోవిడ్ -19 వ్యాక్సిన్ వృధా అయిందని చెప్పారు. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథాకావడం ఒకే విధంగా వుందని ఆయన పేర్కొన్నారు. దీనిని సమీక్షించాలని, టీకా వృథా ఎందుకు జరుగుతోందని ప్రధాని సూచించారు. ప్రతి సాయంత్రం పర్యవేక్షణ తప్పనిసరిగా చేయాలని మోడీ సీఎంలను కోరారు. 

అలాగే కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను సాధారణ లాక్ డౌన్ కాకుండా ఒక ప్రాంతాన్ని మైక్రో జోనింగ్ ను మోడీ ప్రతిపాదించారు. ప్రతి రోజూ 30 లక్షల టీకాలు వేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. వ్యాక్సిన్ ను వేస్ట్ చేయకుండా చూడాలని మోడీ సీఎంలకు చెప్పారు. 

కరోనా వైరస్ గ్రామాలకు విస్తరించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై తరచూ సమావేశాలు నిర్వహించుకొందామని ఆయన చెప్పారు.

దేశంలో గత కొంతకాలంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ కేసుల కట్టడికి చర్యలు తీసుకోనేందుకు సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ఏడాది పలుమార్లు మోడీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే.