ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వస్తున్న సమయంలో తనను జాగ్రత్తగా ఉండాలని చాలామంది హెచ్చరించారని.. కానీ తాను ఇక్కడ ఎంతో ప్రేమాప్యాయతలు, మద్ధతు పొందానని అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ. సీజేఐగా విజయవంతం కావడానికి అదే తనకు "లాంచ్ ప్యాడ్"ల పనిచేసిందని అన్నారు.
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు కొలీజియం తన హయాంలో దాదాపు 224 మంది న్యాయమూర్తులను పలు హైకోర్టుల్లో నియమించడంతో విజయవంతం అయ్యిందన్నారు. ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన అన్ని పేర్లను దాదాపు క్లియర్ చేసిందని, ఈ సిఫార్సులు కేంద్రం ఆమోదం కూడా పొందుతాయని తాము భావిస్తున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ గురువారం అన్నారు.
ఆగస్టు 26న పదవీ విరమణ అంటే నేడు పదవీ విరమణ చేయనున్న జస్టిస్ రమణ, తన పదవీ కాలంలో న్యాయమూర్తుల నియామకం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలనుకున్నానని అన్నారు. ఆ మేరకు తాను తన సోదర న్యాయవాదుల అంచనాలను అందుకోగలిగానని భావిస్తున్నానని ఆకాంక్షించారు. "మీరు నా నుండి ఆశించిన అంచనాలకు అనుగుణంగా నేను పనిచేశానని ఆశిస్తున్నాను. సాధ్యమైన మేర భారత ప్రధాన న్యాయమూర్తిగా నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాను. మీ అందరికీ తెలిసిన మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తుల నియామకం అనే రెండు సమస్యలను నేను వీలైనంత వరకు పరిష్కరించాను.
త్రిసభ్య ధర్మాసనానికి ‘ఉచితాలు’ కేసు.. రిఫర్ చేసిన సుప్రీంకోర్టు
మీ అందరి సహకారానికి ధన్యవాదాలు. సుప్రీంకోర్టు, కొలీజియంలోని నా సోదర, సోదరి న్యాయమూర్తులు అందించిన మద్దతుతోనే ఇది సాధ్యం అయ్యింది. నా పదవీకాలంలో దాదాపు 224 మంది న్యాయమూర్తులను హైకోర్టులలో విజయవంతంగా నియమించాం" అని పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆయనకు వీడ్కోలు పలికేందుకు ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విధంగా తన సంతోషాన్ని పంచుకున్నారు.
జస్టిస్ ఎన్వీ రమన సెప్టెంబర్ 2013 నుండి ఫిబ్రవరి 2014 వరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ వీడ్కోలు సమావేశంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తుల నియామకంపై మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయన్నారు. ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి ఒకటిరెండు పేర్లు తప్ప అన్నింటినీ దాదాపుగా క్లియర్ చేశాం. ఇక ప్రభుత్వం ఆ పేర్లను కూడా క్లియర్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను" అన్నారు.
ఈ కార్యక్రమానికి ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కౌల్, ఇందిరా బెనర్జీ, సంజీవ్ ఖన్నా, ఎస్ రవీంద్ర భట్, హిమా కోహ్లీ.. అలాగే హైకోర్టు న్యాయమూర్తులు, బార్ సభ్యులు హాజరయ్యారు. "సుప్రీంకోర్టులో మేము ఆరుగురం ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఇప్పుడు నేను పదవీ విరమణ చేస్తున్నాను. దీంతో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించేవారి సంఖ్య ఐదుకు తగ్గింది. అయితే త్వరలోనే మరికొంతమంది వీరితో చేరతారని నేను ఆశిస్తున్నాను" అని సీజేఐ అన్నారు.ఢిల్లీ హైకోర్టు దాని "విశిష్ట లక్షణాలు, ప్రత్యేకతలు".. అక్కడికి వచ్చే కేసుల్లో ఉండే లిటిగేషన్లను మరే ఇతర హైకోర్టుతో పోల్చలేమని, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన పదవీకాలమే విజయవంతమైన CJI గా తనకు "లాంచ్ ప్యాడ్" అని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తుల కృషిని అభినందిస్తూ, “న్యాయమూర్తులు రాత్రి 7-8 గంటల వరకు ఛాంబర్‌లో కష్టపడి పనిచేసేవారు. వారు ఉదయమే వస్తారు. రాత్రి 8 గంటల వరకు పని చేస్తారు. కొన్నిసార్లు రాత్రి 9 కూడా అయ్యేది. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. సాధారణంగా, ఇతర ప్రదేశాలలో, న్యాయమూర్తులు 4 గంటల కల్లా వెళ్లిపోతారు’. తాను అక్కడ ఉన్న రోజుల్లో కొన్ని "క్రానిక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేంట్స్’ ఉన్నప్పటికీ, న్యాయవాదులు "క్రమశిక్షణతో" ఉండేవారని ఆయన అన్నారు.
అక్కడ, ఎప్పుడూ ఎటువంటి సమ్మె కానీ, ధర్నాలు కానీ, మరేదైనా సమస్య కానీ తాను ఎదుర్కొన్న సందర్భం ఎప్పుడూ లేదన్నారు. ఇది అతిపెద్ద విజయం అన్నారు. ఎందుకంటే మొదట తాను ఢిల్లీకి వస్తుంటే.. ‘మీరు ఢిల్లీకి వెళుతున్నారు, ధర్నా, సమ్మెలు ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని కొంతమంది నన్ను హెచ్చరించారు. కానీ, అది ఎప్పుడూ జరగలేదు," అని CJI అన్నారు.
ఢిల్లీకి వెళ్లే ముందు తనను "జాగ్రత్తగా ఉండమని" హెచ్చరించారని, అంతేకాదు.. ‘అక్కడివారు చాలా సంస్కారవంతులు, జ్ఞానవంతులు.. కానీ దూకుడుగా ఉంటారు’.. ఈ మాట చెబుతున్నందుకు క్షమించాలి.. అని నన్ను హెచ్చరించారు. కానీ ఇక్కడ నేను మీ అందరి నుండి ఆప్యాయత, ప్రోత్సాహాన్ని అందుకున్నాను అన్నారు. జస్టిస్ రమణ తన ప్రసంగంలో, కొన్ని సంవత్సరాల క్రితం తన "ఇబ్బందికర రోజుల" సమయంలో, బార్‌లోని ప్రతి సభ్యుడు, ముఖ్యంగా ఢిల్లీ, అతనికి సంఘీభావం తెలుపుతూ, అతనికి మద్దతుగా తీర్మానాలు చేశారని, వారు తన "నిజమైన శ్రేయోభిలాషులు" అని అన్నారు
