కరోనా మహమ్మారి ఇప్పటికే దేశ ప్రజలను వణికిస్తోంది. సంవత్సరకాలంగా ఈ వైరస్ భయపెడుతోంది. దీని నుంచి ఇప్పుడిప్పుడో కోలుకుంటుండగా.. స్ట్రైయిన్ కరోనా ఒకటి అడుగుపెట్టింది. కాగా.. తాజాగా.. దేశంలోకి బర్డ్ ఫ్లూ ఒకటి ప్రవేశించింది. 

కేరళలోని కొట్టాయం, అలప్పుజా జిల్లాల్లో బర్డ్‌ప్లూ వ్యాపించినట్టు వార్తలు వస్తున్నాయి. ఫ్లూ సోకి మరణించిన బాతులు, ఇతర పక్షులను అధికారులు గుర్తించారు. ప్రభావిత ప్రాంతంలో ఒక కిలోమీటరు పరిధిలో పెంపుడు పక్షులు మరణాన్ని కూడా అధికారులు రికార్డు చేశారు. అలప్పుజా  జిల్లాల్లోని కుట్టనాడ్ ప్రాంతంలో నెడుముడి, తలాకీ, పలిప్పాడు, కరువుట్టా తాలూకాలో బర్డ్ ఫ్లూ ఉన్నట్టు నివేదికలు వచ్చాయి. 

ఈ మేరకు అధికారులు అలెర్ట్ అవ్వగా.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ బర్డ్ ఫ్లూ గురించి నిర్ధారణ చేసింది.

ఇప్పటి వరకు సుమారు 1,700 బాతులు వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మరణించినట్టు సమాచారం. హిమాచల్ ప్రదేశ్‌లోని పాంగ్ సరస్సు ప్రాంతంలో 2,400 పక్షులు మరణించాయి. కేరళలో ఇప్పటి వరకు మొత్తం 40,000 పక్షలకు వైరస్ సోకినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అధికారులు, పౌల్ట్రీ యజమానులు అప్రమత్తం అయ్యారు. 

అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇంత భారీ సంఖ్యలో పక్షులు మృతి చెందిన దరిమిలా అధికారులు తగిన మందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారన్నారు. దీనిలో భాగంగానే పర్యాటకులు ఈ ప్రాంతానికి రావద్దని తెలిపారు. భోపాల్ నుంచి వచ్చిన రిపోర్టులో మృతి చెందిన అన్ని పక్షులలోనూ హెచ్5ఎన్1 ఎవియన్ ఇన్ఫ్లుయంజా వైరస్ ఉందని స్పష్టమైంది. హిమాచల్ రాజధాని శిమ్లాకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని కాంగ్డా జలాశయంలో ఈ వలస పక్షుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడకు ప్రతీయేటా సైబీరియా, మధ్య ఆసియా నుంచి లక్షల సంఖ్యలో పక్షులు తరలివస్తుంటాయి. ఫిబ్రవరి నుంచి మార్చి వరకూ ఈ విధంగా జరుగుతుంటుంది.