కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన చెల్లి ని తన మూఢ నమ్మకాలకు బలి  చేశాడు.  దైవ అనుగ్రహం, అమితమైన శక్తులు తనకు సొంతమౌతాయనే భావనతో  ఓ వ్యక్తి తన తోడబుట్టిన చెల్లిని బలి ఇచ్చాడు. ఈ దారుణ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఒడిశాలోని బొలంగీర్ జిల్లా కంటాభంజి సమితి సాలబరిటి గ్రామానికి చెందిన జనని రాణా(12))  తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి నివసిస్తోంది. కాగా... కొద్ది రోజుల క్రితం సోదరుడితో కలిసి బయటకు వెళ్లిన బాలిక.. తిరిగి ఇంటికి చేరలేదు. ఎక్కడ వెతికినా బాలిక ఆచూకీ దొరకకపోవడంతో... తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

డిసెంబర్ 24న జనని రాణాను గ్రామంలోని బస్టాండ్‌లో దించేందుకు ఆమె అన్నయ్య సొబాబన్‌ రాణా సైకిల్‌పై తీసుకువెళ్లాడు. అనంతరం ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కలవరపడిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. క్షుద్రపూజలు నిర్వహించే సొబాబన్‌ రాణానే బాలికను ఏదైనా చేసి ఉంటాడని కుటుంబసభ్యులు అనుమానించారు. 28వ తేదీన పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టడంతో పోలీసుల సొబాబన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

AlsoRead కేరళ లో యువతి పెళ్లి... అంతా రాష్ట్రపతి చలువే...

పోలీసులు తమదైన శైలిలో విచారించగా... నిందితుడు నేరం అంగీకరించాడు. అతని ద్వారానే బాలిక మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. గతంలోనూ సొబాబన్ రాణా.. ఓ బాలుడిని ఇదేవిధంగా బలి ఇచ్చాడు. ఈ కేసులో జైలుకి వెళ్లిన సొబాబన్.. ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చాడు. 

అలా వచ్చాడో లేదో ఇలా తన సొంత చెల్లెలిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు మరోసారి అతనిని  అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.