Mumbai: హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌పై తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్ధించుకున్నారు. అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తాము ఏకీభవించడం లేదని మహా వికాస్ అఘాడీలో భాగమైన శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రే అన్నారు.
Uddhav Thackeray: వీడీ సావర్కర్‌పై తమ పార్టీకి అపారమైన గౌరవం ఉందనీ, దివంగత హిందుత్వ సిద్ధాంతకర్తపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తాను ఆమోదించబోనని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే అన్నారు. హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌పై తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్ధించుకున్నారు. సావర్కర్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నవారిని రాహుల్ గురువారం కౌంటర్ ఇచ్చారు. సావర్కార్ బ్రిటిషర్లకు క్షమాభిక్ష పిటిషన్లు రాసి పింఛను స్వీకరించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని కొన్ని పత్రాలను చూపెట్టారు. భయం వల్లే సావర్కర్ అలా చేశారని రాహుల్ చెప్పుకొచ్చారు. ‘‘ఆయన బ్రిటిష్ వారికి సహాయం చేశాడని నాకు చాలా స్పష్టంగా తెలుసు’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
కాగా, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తాము ఏకీభవించడం లేదని మహా వికాస్ అఘాడీలో భాగమైన శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రే అన్నారు. సావర్కర్ త్యాగాలు చేసిన అదే స్వేచ్ఛను కాపాడుకోవడానికి తాను కాంగ్రెస్‌తో చేతులు కలిపానని థాక్రే అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సావర్కర్‌కు భారతరత్న అవార్డును ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. “సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మేము ఆమోదించము. స్వాతంత్ర్య వీర్ సావర్కర్‌పై మాకు అపారమైన గౌరవం, విశ్వాసం ఉంది. దానిని తుడిచివేయలేము”అని థాకరే అన్నారు. కాగా, మహారాష్ట్రలో బీజేపీ తో శివసేన విడిపోయిన తర్వాత శివసేన, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకుని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
'రాహుల్ గాంధీ చెప్పినదానితో మేం ఏకీభవించడం లేదు. మేము వీర్ సావర్కర్ ను గౌరవిస్తాము. కానీ, అదే సమయంలో, మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు, వారు పీడీపీతో (జమ్మూ కాశ్మీర్లో) ఎందుకు అధికారంలో ఉన్నారో కూడా బీజేపీ చెప్పాలి" అని థాకరే అన్నారు. పీడీపీ ఎన్నడూ 'భారత్ మాతాకీ జై' అనదని ఆయన పేర్కొన్నారు. కాగా, ఉద్ధవ్ థాక్రే కుమారుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాక్రే గత వారం రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే, మహారాష్ట్రలోని భారత్ జోడో యాత్ర సందర్భంగా షెగావ్‌లో జరిగే ర్యాలీకి స్వయంగా హాజరవుతారా అని అడిగినప్పుడు, ఉద్ధవ్ థాక్రే చేయి ఊపుతూ `నో` అని సూచించారు.
అలాగే, "స్వాతంత్ర్య పోరాటంతో సంబంధం లేని మాతృ సంస్థ సంతానం సావర్కర్‌పై ప్రేమను వ్యక్తం చేయడం నవ్వు తెప్పిస్తుంది" అని పేర్కొన్న థాక్రే.. బీజేపీ, దాని మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై విమర్శలు గుప్పించారు. ఆర్‌ఎస్‌ఎస్ త్వరలో 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుందనీ, అయితే అది స్వాతంత్య్ర పోరాటానికి దూరంగా ఉందని, సావర్కర్ గురించి మాట్లాడే హక్కు దానికి లేదని ఆయన అన్నారు. సావర్కర్ త్యాగాలు చేసిన స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని థాకరే అన్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి అంగుళం భూమిని తమ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తిరిగి పొందలేకపోయిందని బీజేపీపై మండిపడ్డారు. హైదరాబాదు నిజాం మిలీషియా అయిన రజాకార్లు హిందువులపై దాడులు చేస్తున్నప్పుడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఎక్కడ ఉన్నాయని థాక్రే ప్రశ్నించారు.
